పుట:Paul History Book cropped.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాబిలోనియా ప్రవాసంలో వున్నారు. ఆ కాలంలో వారికి రాజులు దేవాలయం, బలులు లేవు. కనుక వారి దృష్టి అంతా ధర్మశాస్త్రం మిరాదనే పడింది. విశ్రాంతి దినం, సున్నతి మొదలైన ఆచారాలకు ప్రాముఖ్యం పెరిగింది. ధర్మశాస్తానికి అత్యంత విలువ వచ్చింది. జ్ఞానులు ధర్మశాస్త్రమే జ్ఞానం అని బోధించారు. రబ్బయులు ధర్మశాస్రంలోని ఆజ్ఞలకు కొన్ని క్రొత్త నియమాలు కూడ చేర్చారు. వీటికి పితరుల సంప్రదాయాలు అని పేరు. మోషే ఆజ్ఞలే 613 వున్నాయి. పితరుల సంప్రదాయంలో ఇంకా చాల నియమాలు వున్నాయి. ఇవన్నీ కలసి కొండలాగ పెరిగిపోయాయి. పరిసయులు ధర్మశాస్త్రమే రక్షణసాధనం అన్నారు. దాన్ని పాటిస్తే రక్షణం, పాటించకపోతే దేవుని శిక్ష అన్నారు. పూర్వం అది యూదులు రక్షణం పొందినందున కృతజ్ఞతా సూచనంగా పాటించేది మాత్రమే. అనగా పర్యవసానం మాత్రమే. ఇప్పడు దాన్ని పాటిస్తే రక్షణం కలుగుతుంది అనే భావం ప్రచారంలోకి వచ్చింది. పరిసయులు ధర్మశాస్రం ఆజ్ఞలను ఖండితంగా పాటించారు. కనుక వాళ్లు తమకు రక్షణం తప్పకుండ కలుగుతుందనీ, తాము పుణ్యక్రియలు చేస్తున్నారు కనుక రక్షణ విషయంలో దేవుడు తమకు ఋణపడి వున్నాడనీఎంచారు. దేవుడు తమకు రక్షణాన్ని ఇచ్చితీరాలని వాదించారు. నరుడు తన పుణ్యక్రియలద్వారా తన్ను తానే రక్షించుకొంటాడు అనేకాడికి వచ్చింది వ్యవహారం. క్రీస్తునాడు, పౌలునాడు యూదుల్లో ఈలాంటి భావాలు ప్రచారంలో వుండేవి.

ఐతే పౌలు పై నూత్న భావాలను అంగీకరించలేదు. అతని బోధల ప్రకారం మనలను రక్షించేది ధర్మశాస్త్రం కానే కాదు. క్రీస్తుని విశ్వసించి అతని వరప్రసాదం ద్వారా మాత్రమే మనం రక్షణం పొందాలి. ఇక ఈయంశాన్ని విపులంగా పరిశీలిద్దాం.