పుట:Paul History Book cropped.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలిగ్రంథాలు అనుకొంటాం. తొలినాటి క్రైస్తవులు సువిశేషాలకంటె ముందే పౌలుజాబులు చదివి భక్తివిశ్వాసాలు పెంచుకొన్నారు - 2పేతు 3,15-16. తర్వాత వచ్చిన సువిశేషాలు క్రీస్తుబోధలనూ కార్యాలనూ వర్ణిస్తాయి. పౌలు జాబులైతే క్రీస్తు ప్రాముఖ్యాన్ని - అనగా అతని మరణోత్థానాలనూ, నేడు ఆ ప్రభువు మన జీవితాన్ని ప్రభావితం చేసే తీరునూ వర్ణిస్తాయి. అందుచే అతని జాబులు అందరికీ శిరోధార్యాలు. అసలు క్రీస్తు చెప్పిందేమిటో, చేసిందేమిటో సువిశేషాలనుండి మనకు రూఢిగా తెలియదు. ఆ గ్రంథాల్లోకి చాలా మార్పులు వచ్చాయి. వాటిల్లో అపోస్తలులు చేసిన మార్పులు, ఆదిమ క్రైస్తవపమాజాలు చేసిన మార్పులు, సువిశేషరచయితలు చేసిన మార్పులు కన్పిస్తాయి. పౌలు జాబులు ఈ లాంటి మార్పులకు గురికాకుండ నేరుగా అతని చేతినుండి వచ్చిన స్వచ్ఛమైన రచనలు. కనుక వాటి విలువ యొక్కువ.

ఐనా నేటిమన క్యాతలిక్ ప్రజలకు పౌలు జాబులు అట్టే తెలియవు. మన బోధకులుగూడ ప్రసంగాల్లో పౌలు బోధలను అట్టే వివరించి చెప్పరు. అడపాదడపా అతని జాబులనుండి ఒకటిరెండు వాక్యాలు ఉదాహరించి ఊరకుంటారు. ఇది చాలదు. క్రైస్తవ జీవితమంటే ప్రధానంగా క్రీస్తుని జీవించడమే. పౌలు ముఖ్యబోధకూడా యిదే. కనుక మన విశ్వాసులు పౌలు జాబులను శ్రద్ధతో చదివి మననం చేసికొని క్రీసుపట్ల భక్తి ప్రపతులు పెంచుకోవాలి.

2. పౌలు పూర్వరంగం

పౌలు భక్తుని భావాలను అర్థంజేసికోవాలంటే అతని నేపథ్యం బాగా తెలిసి వుండాలి. ఇక్కడ రెండంశాలు అతిముఖ్యం.