పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవనాటిరాత్రికథ,

ఆఱవనాటి రాత్రియుం బూర్వోక్తప్రకారంగా విజయాచ్యుతులు యమునానదీతటంబునం దాసీనులైన తరి నర్జునుఁడు “బావా! నీదయా రసంబున నిప్పటికీ, ముముక్షమార్గబోథకంబులగు ధర్మంబుల నైదింటిని నాకర్ణించితిని. "నేటి రాత్రి యాఱవది యగు, సచ్చిదానందంబు నెఱిఁగింపుము నావుడు భగవంతుఁడు బావమఱఁదికిట్లనియె. “ధనంజయా! సచ్చిదానంద తత్త్వదోధకంబగు, కామవర్ధన మహారాజు పుణ్య చరిత్రంబు గల దద్దానిని నాకర్ణింపు"మని యాచరిత్రంబు నిట్లని చెప్ప దొడంగెను.

కామవర్ధన మహారాజుకథ.

మున్ను కాంభోజ దేశముం బరిపాలించు కీర్తివర్ధన మహారాజునకు కామవర్ధనుం డను నాలిగేండ్ల కుమారుఁడుగల్లి, ధర్మపత్ని యగు విపులాదేవి గర్భవతియై యున్న శుభకాలంబున విధి చాలమింజేసి, శత్రురాజులు దండెత్తివచ్చుటయు నారాజన్యుఁడోపినంతపట్టు వారితో రణంబొనరించి, తుదకు పోరంజాలక గర్భవతియగు విపులా దేవితోడను, కుమారుఁడగు కామవర్ధనునితోడను, శాంతయను నొక దాసితోడను దుర్గాంతర్భాగ నిర్మితంబగు గూఢమార్గంబునంబడి, పాదచారియై విదేశముల "కుంబారి పోవ శాత్రవులు నిరభ్యంతరముగ దుర్గంబునాక్రమించిరి. అట్లు గాఢాంధకార సాంద్రంబగు నాగుహలోన, మున్ముందు రాజును, ఆవెనుక, కామవర్ధను నెత్తికొనిన శాంతయు, నందఱికన్న వెనుక గర్భభరాలనయగు విపులయు నడచుచుండ, చిమ్మచీఁకటిలో మార్గముంగానక, విధివశంబున నాగుహలోనంగల మూడుదారులంబట్టి మువ్వురును జనిరి. కామవర్ధను నెత్తుకొని చనుచున్న శాంత పెద్ద పెట్టున నెలుంగెత్తి రాజును రాణినిం బిలిచిపిలిచి వేసారుచుండ నాగుహ ప్రతిధ్వనులనిచ్చుటదప్ప కార్యంబు గలుగదయ్యెను. అంత నాదాసి యాశోపహతయై యాహార నిద్రాదులు లేమి సొమ్మసిలి యొక వృక్షచ్ఛాయను బాలునితో