పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

పండ్రెండు రాజుల కథలు


నిద్రింపసాగెను. ఇంతలో నరుణోదయంబగుటయు నాకుమారుఁడు మేల్కాంచి, "యమ్మా యమ్మా" యని పిలిచి యేడ్చి, దాదివినా యితరులం గానక బెంగటిల్లి తప్పుడడుగుల నిడుచు మెల్లన దాదిని వదలి యా యడవిని కొండొకదూరము నడువ నొకచో నాచిఱుతని కోమలచరణంబున నొక నిశితకంటకము నాటుకొని రక్తధారలుగారఁ దొడంగెను. బాలుని శోకారావంబు నొక హనుమద్వానరం బాకర్ణించి, పరుగు పరుగున నరుదెంచి బాలుని పదకంటకంబు నూడ బెఱికి యొక ననౌషధిందెచ్చి గాయంబుపై రుద్ది బాలునితో నాడు కొనుచుండెను. తత్సమీపంబుననేయున్న యొక గొల్లపల్లియ కధికారి యగు నానందుండను వాఁడు బాలుని, బాలునితో నాడుకొనువానరముం గాంచి యా కోతిని భీతనుగావించి పోద్రోలి, దిక్కులేక , ముద్దులుగుల్కు మోముతోనున్న కామవర్ధను నెత్తి ముద్దాడి, యనపత్యుండగు తనకీశ్వరుండిచ్చిన బాలునిగా దలంచి వానికి హరిదత్తుండను నామంబునిడి, వాని మణిబంధమునంగల రక్షనుగాంచి దాని యాధారంబున బాలుని చరిత్రము నెఱుఁగ వచ్చునను నాశతో పల్లెకుం గొనిపోయి వృద్ధురాలగు తన యవ్వ కిచ్చెను. ఆ యవ్వయు బాలు నతిగోమునఁ బెంచుచు, కాలక్రమంబున విజ్ఞానశీలుఁడగుచున్న యా కుఱ్ఱని కఖిల రాజన్యుల చరిత్రంబులను దెలుపుచుండెను. ఆ పల్లెయందేయున్న యొక బ్రాహ్మణుఁడు హరిదత్తునకు తాఁ గఱచినంత పట్టు విద్యలను నేర్పినంత, హరిదత్తుం డంతట దృప్తినందక, సమీప పట్టణములనుండి, సద్గంథములను, దెప్పించుకొని, క్రమంబున స్వయంకృషిచే నఖిలవిద్యలందునుఁ బాండితిం గాంచి యా పల్లెయందలి గొల్లపిల్లలకు రేడై పశుపాల నోద్యోగంబున నడవికంపఁబడినపుడు, వారిని పరిపాలింపుచు, "పెద్ద లెఱుంగకుండ నాయడవిలో హరిదత్త సామ్రాజ్యము నొండు సంస్థాపించెను. కొన్ని దినంబులిట్లు జఱుగ, నావిపినంబునకు నేపాళ దేశాధిపతి మృగయార్థ మరుదెంచి, యొక వారము దినములందుండెను. ఆ తరుణంబున హరిదత్తుఁ డవ్వకడకరిగి నేపాళాధీశుని