పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

పండ్రెండురాజుల కథలు.


తిలకా! తావకాశీర్వచన ప్రభావంబున నాకింతవఱకు శుభంబుగలిగే; కాని——నేనువచ్చినకార్యంబును నెరవేర్చుకొనక యే మొగంబున నింటి కరిగి నాతలిదండ్రుల మొగంబులు చూతు" ననిపలుక, నాముని నవ్వి “రాకుమారా! నీకిది యేమి వెఱ్ఱి! ఎవ్వరైనఁ బులిపాలు తేగలరని నమ్ముచుంటివా? ఇది నీపై విరోధంబున నీ సవతితల్లి యొనరించిన కపటము. కావున నీ వాయత్నంబు మానుకొని స్వభార్యతో నిజరాజధాని కరిగి పట్టాభిషిక్తుండవు గ"మ్మనిన నాసుధాకరుం డందుల కామోదింపక——"మునీంద్రా! తమ యాశీర్వచన బలంబున పులిపాలను నిమిషమాత్రంబున సాధింపఁ గలనను ధైర్యము నాకుఁగలదు. నన్నేల నిరుత్సాహ పఱచెదరు. రిక్త హస్తంబులతో, నే నింటికరుగఁజాల" నని పలుక నాతని మనోనిశ్చయంబున కాముని మిగుల నానందించి “కుమారా! నీవు ధైర్యశాలివి; విజయమందఁగలవు. ఈ యత్నంబునఁ గూడ 'తారకమంత్రమే నీకు శరణ్యము; తారకమంత్ర పఠనం బొనరించుచుండు నీకు సమస్త క్రూరజంతువులును వశ్యంబులగును. దానం జేసి సులభముగా నీవు పులిపాలను సేకరింపఁగలవు, పోయిర"మ్మని దీవించి పంపెను.

అంత నారాజనందనుఁడు నిజదారా పరివార సమేతంబుగ నొక భయదాటవిం బ్రవేశించి యీనిన శార్దూలముల యెదుట నిలచి తారకమంత్ర జపంబొనరింప నవి మంత్రబద్ధ భుజంగములట్లు వశీకృతంబులై పోవ వలసినన్ని క్షీరముంగొని నిజరాజధాని కరిగి సుధాకరుఁడు పులిపాలకై చని మృతినొందెనని శోకించుచున్న నిజ జననీజనకులకు మనఃప్రమోదముం గలిగించెను. విలాసవతియు పశ్చాత్తప్తయై తొంటి వైరమును మఱచి యాదంపతుల నాదరించెను. అనంతరము బహు కాలము వజకును సుధాకరుఁడు కనకాంగితో సుఖించుచు రెండు రాజ్యంబులను సోదర సహాయంబున 'నేకచ్ఛత్రంబుగ బరిపాలించి పుత్ర పౌత్రాభివృద్ధింగల్లి వర్ధిల్లెను.