పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిరకారిమహారాజు కథ

43


మీకు ప్రభువు. హీనుకులజుఁడగువీఁడు మాకేటి ప్రభువను సంశయము మీకక్కఱలేదు. ఇతఁడే యీ రాజ్యమునకు నిజమైన ప్రభువు. గతించిన, శూరబాహు మహారాజపుత్రుఁడగు వీరబాహుఁడే యీ బాలుఁడు చిత్రానామధేయంబుననున్న బాలికయే యీ వీరబాహుని మేనత్తకూతురగు శైలవతి. నేను నిజముగా మహర్షినిగాను, ఈబాలుని తల్లినగు సుశీలను. " అని పల్కి కృత్రిమములగు తన మీసములను గడ్డముందీసి వేసి యంగనయై నిలచి—— తానొనరించిన కార్యముల నెఱిఁగించి, “మఱియు నో ప్రజలారా! ఈ బాలుని విషయంబున మీకు సంశయముగల దేని వీని నొసటంగల మచ్చను చూడుఁడు. బాల్యమున దీయఁబడిన వీని ఛాయాపటము గలదు. అందుసయితము మీకీమచ్కాకాన్పింపగల "దని పలుక ప్రజలందఱును జయజయ ధ్వానంబుల నొనరించి యాపడతి యొనరించిన మహా కార్యమును స్తుతించిరి. వీరబాహువు తల్లినిఁ గౌఁగిలించుకొని యానందాశ్రువులను రాల్చెను. పశ్చాతప్తుఁడైన క్రూరబాహుని క్షమించి, వీరబాహుఁడు శైలవతిని మహావైభవంబునం బరిణయమాడి యుత్కళరాజ్యమును చిరకాలము పరిపాలించెను.