పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐదవనాటి రాత్రి కథ.

పంచమదివసంబున భాస్కరుం డవరవారాశీ గ్రుంకినంతనే నరనారాయణులు రాత్రి భోజనంబొనరించు విలాసవైఖరి సంభాషించుచు, యధాపూర్వకంబుగ, యమునా సైకతభూముల విహరింప నరుదెంచి యట సుఖోపవిష్ణులై తాంబూల చర్వణంబొనరించుతరిఁ బ్రసంగ వశంబున పార్ధుం డధోక్షజుందిలకించి——"యోదేవా! ఇంతకుమున్ను గడచిన యామినీచతుష్కంబునను, నాకు మనప్రమోదకరంబులగు నట్టివియు——నిహపరోత్తారక హేతు భూతంబులగునట్టివియు నగు కథా చతుష్కంబును కర్ణరసాయనంబుగ నెఱిఁగించితివి. నేటిరాత్రి పంచమ యోగంబగు తారకరహస్యముం దెలుపు ఫుణ్య చరిత్రము నొక దాని నెఱిఁగించి, నన్ను ధన్యాత్మునొనరింపుము " నావుడు, పురుషోత్తముఁడు మందస్మితముఖుండై——"విజయా! సావధానుండవై సుధాకర మహారాజు చరిత్రంబు నాలకింపుము. నీసంశయము తొలంగ గలఁదని పలికి, వెండియు నిట్లు పలుకసాగెను.

సుధాకరమహారాజు కథ.

తొల్లి వంగదేశమును, పద్మాకరుం డనురాజు పరిపాలించుచుండెను. ఆరాజోత్తంసునకు, భారతి, విలాసవతియను నిరువురు భార్యల యందును క్రమంబున సుధాకర, ప్రభాకరులను పుత్రులు జన్మించిరి. రాజు కనిష్ఠ సతీతిలకంబగు విలాసవతి యందలి మోహంబు పెంపున నామె సవతి మత్సరంబున నొనర్చిన దుష్టొపదేశంబులచేఁ బ్రేరితుండై సాధ్వీతిలకంబగు భారతిని, నిరాకరించి, యామెను సపుత్తకంబుగ రాజ మందిర బహిష్కృతనుగా నొనరించి, యత్యధమంబగు దిన వెచ్చముం బంపుచు విలాసవతితో సుఖభోగములం గాలము గడుపుచుండెను. శుక్లపక్ష సుధాకరునిభాతి యువరాజగు సుధాకరుండును, దినదిన ప్రవర్ధమానుం డగుచు చతుషష్టి కళలయందును, నష్టాదశ విద్యల యందును