పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీన కేతనమహారాజు కథ

19


వేయఁబడిన బిడ్డలను మువ్వుఱను దిక్కు లేనిపక్షులనుగా విడిచిపోయిరి. మాతాపితృహీనులై నను మతిధీమతు లిర్వుఱును నన్యసహాయంబు నపేక్షింపక నెట్లో దినంబులు గడుపుచుండ ననసూయ దినదిన ప్రవర్ధమానయై క్రోక్కారు మెఱుఁగు తెఱంగున నభినవయౌవనప్రాతుర్భావయై సహోదరులకు తీరనిమనోవ్యధం గలిగించెను. ధారానగర విప్రులు తాము వెలివేయుటే కాక, తామెఱింగినంతవఱకుఁ బ్రతియూరఁగల విప్రులకును దేవశర్మ చరిత్రముం బ్రకటపఱచి యనసూయ నేవిప్రకుమారుండును వివాహమొనర్చుకకొనకుండఁ గట్టడ చేసిరి. ఈ విధమైన సంకటంబునం బొగులు సహోదరుల విచారంబు నెఱింగిన యనసూయ “సోదరులారా! నన్నుఁదలంచి మీరు చింతింపవలదు. నా ప్రారబ్ధకర్మ మిట్లేయున్నచో నే నామరణాంత మవివాహితనై యుండ నేఱ్తును. మీకప కీర్తిఁదేను." అని పలుక, నామె మాటలను విని యేమియుం, బలుక నేరక సోదరులు దుఃఖించిరి. అనసూయ తనకుఁ దోడుగా సుశీలయగు నొక వృద్ధదాసీం దోడుగా నుంచుకొని, దినమున కొక్కమాఱు మాత్రము తెల్లవాఱుజూముననే తటాకంబున కరిగి జలముంగొని వచ్చి సోదరులకు వచనాదుల నొనరించుచు, సద్గ్రంధ కాల క్షేమంబున దినంబులం బుచ్చుచు నొరుల కంటఁబడక దినంబులు గడుపుచుండెను. ఇట్టి సత్ప్రవర్తనము గల్గిన యనసూయ పైఁ బురజను లెట్టి దుష్ప్ర వాదంబు లిడుటకును నవకాశము గల్గకపోయెను. ఇట్లుండఁ గొన్ని దినంబుల కాబాలికకు గర్బోత్పత్తియగు చిహ్నంబులు పొడసూప పరిచారిక దానిం గనిపెట్టి, విస్మయమునంది యేకాంతంబున నక్కోమలిం బిలిచి "యమ్మాయీ! నీకు గర్భోత్పన్న మైయున్న యది. నీవు గృహంబువిడిచి యెందునుం జనిన దానవు గావని నీకు ఛాయవలె వెంటనంటియుండు నేను బాగుగ నేఱుంగుదును. కాని యీస్థితికిఁ గారణమేమో నా కగోచరం బై యున్నది. నాకు వాస్తవంబు నెఱిఁగింపుము; భయము లే"దని పలుక నక్కుసుమ కోమలిగుండెలు ఝల్లుమన, వెలవెలంబోవుచు, “నోసీ! దాసీ! నీపై