పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

పండ్రెండు రాజుల కథలు


నానయిడివచింతు—— నే నేపాపం బెఱుంగను. గర్భంబన నేమి? అదియెట్లు గల్గును! నీవేమియో పల్కెదవుగాని, నాకొక్కటియుం దెలియ” దని పల్కి రోదనము సేయఁజొచ్చెను. దాసియు నిదమిద్ధమని నిర్ణయింపఁ జాలక, యూరకుండినఁ దనపైఁబడునని, సోదరులగు సుమతి, ధీమతులకు వేర్వేఱ నీవిశేషము నెఱిఁగించెను. అంత నాసోదరు లిరువుఱు నెవఱి యంతటవారు తమతమ యాత్మగతంబుల “ఛీ! ఛీ! యౌవనమెంత చెడ్డది! అనసూయ పరపురుషునిఁ గంటఁజూడనిదగుట ప్రత్యక్షానుభవ విషయంబు, అట్లైన గర్భోత్పత్తియగుట కేమి కారణము! నిప్పు లేక పొగరాజదుగదా! నాసోదరుఁడు యుక్తవయస్కయైన సోదరింగని కామపీడితుఁడై యకార్యంబొనరించెను. కాకున్న మఱియొక రెవ్వఱురాగలరు! కామపిశాచము సోదరియనియైనఁ దలంపనీయదు కాఁబోలును! ఈ యింట నుండుటకన్నఁ బాపకార్యంబింకొకటి" లేదని తలంచి, యొకఱు పాపంబొనరించిరని యింకొకఱుతలంచి "నీవిట్టి దుష్కార్యం బొనర్చితివి గాన నేను గృహ్య త్యాగినై పోవుచుంటి”నని యిరువుఱును నేక కాలంబున రెండుచీట్లను వ్రాసి, యింటనుంచి వేర్వేఱు త్రోవలంబట్టిపోయిరి. మఱునాడనసూయ సోదరుల నిర్వుఱను గృహంబునంగానక, వారి లేఖలంగాంచి పెద్దపెట్టున శోకించుచు, నాత్మహత్యకుఁ దెగించెను. పరిచారిక యామెను సాహసమునుండి వారించి, “బిడ్డా! నీవు చూలాలివై యున్నావు; యిట్టియెడ నీవాత్మహత్య యొనరించితివేని, యాత్మహత్యాపాపమేగాక, భ్రూణహత్యాపాపంబునుంగల్గును. నీవెట్లు గర్భిణి వైతివో చిత్రముగనున్నది. ఎద్దియేసి కలఁగంటి వేమో స్మృతికిఁ దెచ్చుకొను” మనియడుగ నాయెలనాగ పెద్దతడవు స్మృతికిఁ దెచ్చుకొని, "యౌనేదాసీ ! కొన్ని నెలలకుఁ బూర్వము నాస్వప్నంబున సెవ్వఱో రత్నకిరీట కేయూరహారధారియగు నొక దివ్యపురుషుండు గాన్పించి నాయురోజంబులనొత్తి కెమ్మోవిని మునిపంట నొక్కి, యధరామృతంబాని చెక్కిలి ముద్దిడి, నాకమితానందముం