పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకృష్ణార్జునులు——ఖాండవమునుదహింపజేసిన కథ.

113


గలవు. అద్దానిని నీవు దహించితివేని స్వస్థుఁడవగుదువు. కృష్ణార్జునుల యాగమనంబును ప్రతీక్షించుచు నీవందే వేచియుండు” మని యానతిచ్చెను, మహాత్ములారా! మిపాలఁబడితిని. నీటముంచినను——పాల ముంచినను మీదే భార"మని ప్రార్థించెను. కృష్ణుఁ డాతనింగాంచి, సదయ శీతలవచనంబుల, “మహాత్మా! వీతిహోత్రా! నీ కారణంబునఁ గదా——సమస్త దేవతలకును హవిస్సులు లభ్యంబగుచున్నయవి! ఇట్టి నీ వ్యాధిమాన్ప నేనిలింపుఁడు నిన్నడ్డగించఁగలఁడు. యధేచ్ఛగా——నీవీ ఖాండవవనంబును దహింపు" మని ధైర్యమిచ్చెను. అంత అగ్ని హోత్రుఁడు మహానంద కందళిత హృదయుఁడై——శ్రీకృష్ణునకు శంఖు చక్రములను, అర్జునకు శ్వేతాశ్వసంకలిత దివ్యరధంబును, గాండీవమును, అక్షయ తూణీరంబులను నోసంగి మహావిశ్వరూపథారియై, యాఖాండవోద్యానమును దహింప దొరకొనెను. అంత, నాయుద్యానవనపాలకులగు భటు లాయుద్ధతికి దాళఁజాలక, బిరబిరనరిగి యవ్వార్తను దేవేంద్రున కెఱిఁగింప, నాతఁడు బిట్టలుక వహించి, యనంతంబగు నిలింప సైన్యముతోడ, పుష్కలావర్త మేఘంబులఁ దనవెంటనిడుకొని మహారభసంబున, నరు దెంచుచుండెను. సహస్ర లోచనుని సన్నాహముంగని యర్జునుఁడు వెనుకంజవేయక, తన యక్షయతూణీరములతోడ నావనంబునకు చుట్టును భద్రంబగుకోటను నిర్మించి, యద్దానికి రెండు ద్వారంబు లేర్పరచి యొక ద్వారముఖంబున ససజ్జితగాండీవియగు తానును——రెండవద్వార ముఖంబును చక్రహస్తుండగు చక్రియు నిలువ, నగ్నిహోత్రుని నిర్భయముగా దహింపుమని ధైర్యవచనంబు లాడెను. దేవేంద్ర నిర్ముక్తంబులగు నాసప్త జలధరంబులును, ప్రళయకాలాట్టహాసంబు నెరపుచు, నఖండంబుగా వర్షింపుచు, నిర్ఘాతంబులనురాల్చుచు, తమ సామర్థ్యమంతయుం జూపినను, అగ్నిహోత్రునిపై నొక జలబిందువైనఁ బడకుండుటంగని నిర్వీర్యంబులయ్యె. సప్తమేఘంబులట్లు పరాభూతంబులగుటంగని, గినియుచు, దేవేంద్రుఁడు దేవసేనాసహాయంబున, పార్థునితో నఖండసంగ్రామం బాచరించియు