పుట:PadabhamdhaParijathamu.djvu/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వాడుకలో ఉన్నవి ఎక్కుటా వారి ఉద్దేశం కాదు. మఱి శబ్ద పల్లవక్రియలను ఆ పదబంధంలోనుండి తప్పించి ముందుపదానికి అర్థం మార్చి వ్రాసి యిచ్చుటతో నుడికారపు వడుపే తెలియరాకుండా పోయినది.

చన్ని చ్చుట అన్నది అలా ఒకటిగా కాక, చన్ను అనుమాటకు స్తన్యము అన్న అర్థం కూడా ఉన్న దని వ్రాసి, ఆ ప్రయోగ మిచ్చీ ప్రయోజనం తక్కువ. చన్నుకు స్తన్యమన్నది చన్ని చ్చుటలో తప్పా వ్యస్తంగా ఎన్నడూ రాదు. అలాంటప్పుడు ఆ మాటకు ఆ అర్థమూ ఉన్న దనుట ఎలా? విభిన్న పదాల కలయికతో అవలా విశిష్టార్థాలలో ఏర్పడిన మాటలు.

ఈ విషయం శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రిగారు 'సాహిత్యసమీక్ష' లో విపులంగా చర్చించినారు.

అట్లని ఏవీ కోశాలలో చేర లేదని కాదు. బ్రౌణ్యం మొదలు, వావిళ్ళదాకా ఎన్నో చేరినవి. కొన్ని ఏపదం క్రిందనో ప్రయోగాలలో ముక్కు మొగం తెలియకుండా కూర్చున్నవి. కొన్ని విడివిడిపోయి వేరు కాపురాలు పెట్టినవి.

మఱి అలా కాక నుడికారాలను వేఱుగా, అకారాదిగా సంగ్రథనం చేయడానికి తొట్టతొలిసారి ప్రయత్నించినవారు శ్రీ నాళం కృష్ణారావుగారు. 'తెలుగు జాతీయములు' అను పేర వా రొకగ్రంథం రెండు సంపుటాలలో ప్రచురించారు.

అందులో కేవలం రెండువేల చిల్లర పదబంధాలు మాత్రమే చేరినవి. అయినా వారి కృషి ప్రప్రథమం, ప్రముఖం.

ఇలా అటూ చెటూ చెదరి ఉన్న వే కాక మొత్తం వాడుకలో ఉన్నవీ, వాడుకలోనూ గ్రంథాలలోనూ కూడా ఉన్నవీ, గ్రంథాలలో మాత్రమే మిగిలి వాడుకలో మాయమయినవీ అన్నీ-పై వర్గా లన్నింటికి చెందినవానిని ఒక చోట చేర్చవలె నని ఆంధ్రసాహిత్యఅకాడమీ మహా సంకల్పం చేసి, మాకు పని అప్పగించినది.