పుట:PadabhamdhaParijathamu.djvu/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఇదొక మహాసముద్రమథనంవంటిపని. మనవాఙ్మయం అనంతం. అందులో అచ్చయినవీ, అచ్చు కానివీ, అపపాఠాలతో అచ్చయినవీ, అసమగ్రంగా వెలువడినవీ, అంతు తెలియనివీ, అంతు పట్టనివీ ఎన్నో గ్రంథా లున్నవి.

ఇక కోశాదులలో సంగ్రథిత మైనవానిని ఈ దృష్టితో వేఱు చేసి సరిచూచుకుంటున్నప్పుడు అర్థాలు సరికొత్తగా చూచుకొని నిర్ణయించుకొనవలసిన అవసరమూ ఏర్పడినది. కొన్ని వాడుకలో ఏ మూలో ఒకమూల నునిర్దిష్టమూ సుస్పష్టమూ అయిన అర్థంలో ఉండగా, ఆ వాడుక వినక చెప్పిన సుదూరార్థాలూ అవీ సరిచేసుకొనకా తప్ప లేదు. పైగా పాఠాలను కొన్ని చోట్ల సరిదిద్దుకొంటే తప్ప కుదరని పట్టులూ చాలానే కనిపించినవి.

ఇలా ఈపని సువిస్తృత మై పోయినది. అందువల్ల కొంత పరిశ్రమ ఎక్కు వైనా తప్ప దని సరికొత్తగా ప్రధాన గ్రంథసంచయా న్నంతటినీ నన్నయనుండీ నేటి కవులలో తెనుగు నుడికారపు సొంపులు నింపుకున్న పలువురు రచయితల గ్రంథాలదాకా చూడవలసి వచ్చినది.

అట్లని ప్రతిగ్రంథం చూడడం సాధ్యమా? ప్రాచీన గ్రంథసంచయంవఱకూ, దాదాపు ఏ యుగంలో నైనా సరే ప్రధానగ్రంథాల నన్నిటినీ పరిశీలించడం జరిగినా, నేటి వానిమాట అలా చెప్ప వీలు లేదు కదా !

మఱి వాడుకలో మాత్రమే ఉన్నవాని సంగతి ఏమని చెప్పగలం? అవెన్నో ఎటు పడితే అటు సాగ రాగాధాలలో కలిసిపోయిన మంచి ముత్యాలలా చిప్పల పొత్తిట దాగి ఉన్నవే! అవెట్లా ఎన్నని పైకి తేగలం?

అయినా సాహసించినాము. విన్నన్ని, విన్నవా రుపయోగించగా విన్నన్ని, విని వ్రాసినవారు వ్రాయగా చూచినన్ని-ఇలా చాలవఱకు సేకరించినాము.

తొలుత ఏదో యింతే కదా అనుకున్న కృషి తలకు మించిన బరు వైనది. అయినా పూనికతో పాఠాలమొదలు,