పుట:PadabhamdhaParijathamu.djvu/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అర్థాలమొదలు, వాని ప్రయోగాల మొదలు, వాని వాడకం మొదలు అన్నిటినీ పరిశీలించి ఒకకొలికికి తేగలిగినాము.

ప్రతి పదబంధానికీ అర్థం వివరణం, ప్రయోగం దాదాపు ఇచ్చినాము. ప్రయోగంతోపాటు నేడూ వాడుకలో ఉన్నప్పుడు మేమే ఆ నుడికారం ఉపయోగంచేతీరును తెల్పుతూ అర్థం స్ఫురింపజేసే వాక్యాన్ని చేర్చినాము. కేవలం గ్రంథస్థమే అయినప్పుడు ప్రయోగమే ఇచ్చినాము. కేవలం వాడుకలోనే మేము వినిన దైనప్పుడు వాడుకలోని వాక్య మొకటి మాత్రమే ఇచ్చి వున్నాము. జంటపదాలను ధ్వన్యనుకరణాలను సూచించాము.

మఱొక - మనభాషలో మాత్రమే ఉన్న - ఇబ్బంది చెప్పక తప్పదు. ఆంగ్లంలో మఱి ఏ పదబంధంలో నైనా ఆ మాట మాటగానే ఉండి పోతుంది. మన కలా కాదు. కన్ను - కంటిలో రూపం మారుతుంది కదా. అట్లే కన్ను బహువచనంలో కన్నులు, కనులు, కండ్లు, కళ్ళు ఇలా నాలుగు రూపాలలోనూ వినవస్తుంది. మఱి అన్నిటా అవెలా ఇవ్వడం? చాలవఱకు ప్రధానంగా అన్ని రూపాలలో కానవచ్చేవి కొన్ని యిచ్చినా, మిగతవి ఒక రూపంలో ఆ అక్షరంక్రింద కానరాక పోతే మఱొకఅక్షరం క్రిందిరూపంలో ఉంటుంది. అన్నీ అన్నిరూపాలలో ఇస్తే అనవసర గ్రంథవిస్తరణం అవుతుం దనీ ఒకభయం.

ఇక ఎన్నడూ రగడగానే ఉండి ముగబడని బండి ఱాలూ రేఫలూ ఉండనే ఉన్నవి. ఇదొక పెద్ద సమస్య. అయినా నేటి వాడుకలోనూ చాలవఱకు వ్రాతలోనూ పాటింపనిది. అందుకని రెండిటా కొన్ని యిచ్చాము. కొన్ని ఏదో ఒకటి క్రింద ఇచ్చాము. యథార్థానికి మేము ఈ ప్రత్యేకపదబంధంలోని రేఫం - శకట రేఫమా? సాధు రేఫమా? అని సిద్ధాంతరాద్ధాంతాలకు దిగ లేదు. దిగితే మాకాలం దానికే సరిపోయేది. అది ప్రస్తుతనిఘంటువునకు ప్రయోజనకారి కాదు.