పుట:PadabhamdhaParijathamu.djvu/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలాంటిదే మన అరసున్న పరుసదనం. ఇందులో మేము ప్రధానపదబంధసూచికలో గాని, మా వివరణంలో గాని, మా వాక్యాలలో గాని అరసున్నలు అసలు ఉపయోగించ లేదు. ప్రయోగాలలో మటుకు ఉన్న వున్నట్టు ఉంచాము.

నిజమే! అర్థం విభేదింపజేసే అరసున్నలూ వున్నవి. అయినా అవి ప్రయోగాలలో ఎలాగూ ఉన్నవి. వాడుకలో నే డెలాగూ అంతరించినవి. అందుకని ఈ పద్ధతిని మే మనుసరించాము.

వివరణలో సాధ్య మయినంత ఆ పదబంధ మెలా ఏర్పడిందీ మాకు తెలిసిందాకా వ్రాశాము. బొత్తిగా తెలియని కొన్నిటికీ ఆ మాట ఒప్పుకునే అర్థం చెప్పాము. ఇంకా తేలనివీ, ఆలోచించవలసి ఉన్నవీ అలా అని తెలివిడి చేశాము.

వివరణంలో కేవలం ఇంతదాకా వచ్చిన కోశాలలోని అర్థాలను అలా పరిగ్రహించక కొత్తగా చెప్పినవీ చాలానే ఉన్నవి. వానికి తగిన ఉపపత్తి ప్రతిచోటా చెప్పడం సాధ్యంకాక పోయి ఉండవచ్చు. వీ లున్న చోట వ్రాశాము. మా మట్టుకు మాకు తగినంత ఉపపత్తు లున్నప్పుడే ఇలా విభిన్నార్థం వ్రాశాము.

ఇవన్నిటినీ ఇక్కడ వివరించడం అసాధ్యం. అదొక గ్రంథం అవుతుంది. అ దిక్కడ అవసరమూ కాదు.

ఆ! అన్నట్లు వివరణాదు లన్నీ వ్యావహారికంలోనే ఉన్నవి. అందుకు ఉపపత్తు లీనాడు చెప్పవలెనా?

శక్తివంచన లేకుండా ఒక సంవత్స రానికి పైగా మేము చేసిన కృషి ఈనాడు మీ ముం దున్నది. అయితే, ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేయక తప్పదు. భాషామహాసముద్రం గడవ నీదినా మని చెప్పడం ఎవ్వరి తరం?

అందులో నుడికారాలవంటివి వాడుకలోనే ఎన్నిఉన్నవో లెక్కపెట్టి చక్క బెట్టినా మనడం చుక్కలను లెక్కించినా మనుట వంటిదే. అయినా చుక్కల లెక్క అంచనా వేస్తూనే ఉన్నారు. అలాగే మేమూ వేశాము!