ఈ పుట ఆమోదించబడ్డది
అడ్డ_____అడ్డ 49 ఆద్ద_____అడ్డ
అడ్డగాడిద
- తిట్టు, పనీపాటా లేకుండా తిరిగేవాడు.
- అల్లరిచిల్లరిగా తిరిగేవాడు.
- మాటా. 9.
- "వాడు అడ్డగాడిదలా ఊరంతా ఎప్పుడూ తిరుగుతుంటాడు." వా.
అడ్డగాలు వేయు
- అడ్డగించు.
- "పోకు మని యడ్డగాల్ వేయంగన్." సారం. 2. 16.
అడ్డగోడ
- కొంచెం ఎత్తుగా హద్దు నేర్పరుస్తూ పెట్టుగోడ.
- "వాళ్లింటికీ వీళ్లింటికీ మధ్య అడ్డగోడ ఒక్కటే వ్యవధానం. వా ళ్లెప్పుడూ అన్న దమ్ముల్లాగా ఉంటారు." వా.
అడ్డగోడమీద దీపం పెట్టినట్లు
- అటూ యిటూ కూడా ఉన్నట్లుండు. ఎటోఒక వైపు మొగ్గక అనుట.
అడ్డగోడమీది పిల్లి
- చూ. గోడమీది పిల్లి.
అడ్డగోలుగ
- ఎటు పడితే అటు.
- రుద్రమ. 84. పు.
అడ్డగోలు వ్యవహారం
- గందరగోళపు వ్యవహారము.
అడ్డపట్టుపాప
- అడ్డపాప.
- "అడ్డపట్టెడు పాప డంటవె యోయమ్మ." సారం. 2. ఆ.
- చూ. అడ్డపాప.
అడ్డపట్టుల పాప
- చిన్ని పాప.
- అడ్డాలలోని పాప. తె. జా.
అడ్డపచ్చ
- ముదురుపచ్చ.
- "సుకుమార శుకచ్ఛదచ్ఛటా దాయా దంబు లై యడ్డపచ్చ గొనునవియును."
- కాశీ. 7. 26.
అడ్డపడు
- 1. కాళ్ళమీద పడు. 2. అడ్డు వచ్చు.
- "నెగులున నడ్డపడి యేడ్చి." సారం. 3. 199.
- "తప్పుదు బ్రహ్మశతం బడ్డపడిన." గౌర. హరిశ్చం. పం. 1078.
- "అడ్డపడి చెప్పుకుంటే వినక పోతాడా." వా.
అడ్డపాప
- పసిబిడ్డ.
- చిన్న తనంలో పసిపిల్లలను చేతులపై అడ్డముగా పెట్టుకొని పోవుటపై వచ్చిన పలుకుబడి. అడ్డాలలో బిడ్డ డనుట.
"...నోరిలోపలన్ వ్రేలిడినప్పుడన్
గఱవనేరడు నీసుతు డడ్డపాప యౌ." సారం. 3. 58.
- చూ. అడ్డపట్టుపాప.
అడ్డపెట్టు
- అడ్డగించు.
- "ధర్మపరిపాలుర మమ్ము నడ్డపెట్ట..." భాగ. షష్ఠ. 81. ప.