ఈ పుట అచ్చుదిద్దబడ్డది
గొంతు - గొంతు 645 గొంతు - గొంతు
గొంతు నొక్కు
- నోరు నొక్కు. నా. మా. 12.
గొంతు పట్టుకొను
- 1. గొంతుమీదికి వచ్చు.
- "అప్పు డేదో అన్నాను. ఇప్పు డది గొంతు పట్టుకొంది." వా.
- 2. గొంతున కడ్డము వచ్చు.
- "గొంతు పాట్టుకొం దేమో! మంచినీళ్లు తాగ రా ! అంత యెక్కిళ్లు పెడుతున్నావు." వా.
గొంతు పెగలకుండు
- నోట మాట రాకపోవు.
- "వా డింట్లో తెగ వాగుతాడు గానీ నలుగురిలోకి వస్తే గొంతు పెగలదు." వా.
గొంతుపోక
- గొంతుముడి.
- చూ. గొంతుముడి.
గొంతు బొంగురు పోవు
- 1. గద్గద మగు.
- "వాళ్లమ్మ కనిపించగానే భావాతిరేకం పట్ట లేక పోయాడు. వాని గొంతు బొంగురు పోయింది." వా.
- 2. గొంతు రాచి పోవు.
- "పురాణం చదివి చదివి వాడిగొంతు బొంగురు పోయింది." వా.
గొంతుమీద కూర్చొను
- ఏదైనా యిప్పుడే కావా లని నిర్బంధించుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- "ఇప్పుడే సొమ్మంతా కావా లని వాడు గొంతుమీద కూర్చున్నాడు." వా.
గొంతుమీదికి వచ్చు
- ప్రమాదస్థితి ఏర్పడు; ప్రాణాలమీదికి వచ్చు.
- "ఆ విషయం యిలా గొంతుమీదికి వస్తుందని నే ననుకో లేదు." వా.
- "అక్కడా యిక్కడా అన్నమాటలే యీ రోజు గొంతుమీదికి వచ్చాయి. గమనించావా?" వా.
- చూ. మెడమీదికి వచ్చు.
గొంతుముడి
- గొంతుముందు కాయగా కనిపించే ఎముక.
- చూ. గొంతుపోక.
గొంతు మూగవోవు
- స్వరవిహీన మగు.
- "నా గొంతు మూగవోయింది." వా.
- రూ. గొంతుమూగపోవు.
గొంతులో గురక పుట్టు
- అవసానదశ సమీపించు.
- చనిపోవునప్పుడు గొంతులో కఫం క్రమ్ముకొని రావడంతో గురగుర మనుటపై వచ్చిన పలుకుబడి.
- "ఆవిడకు గొంతులో గురక పుట్టింది. ఇక ఏం జరిగినా గంటలే." వా.
గొంతులో నీళ్లు దిగడం లేదు
- చాలా జబ్బులో ఉన్నాడు. ఏమాత్రం త్రాణ లేదు అనుట.
- "వాడికి రెండురోజులుగా గొంతులో నీళ్లు దిగడం లే దట." వా.