ఈ పుట అచ్చుదిద్దబడ్డది
గుడ్డి - గుడ్ల 628 గుడ్ల - గుణ
గుడ్డిదీపం
- ఎక్కువ ప్రకాశం లేని దీపం.
- "ఆ గుడ్డిదీపం వెలుగులో ఏమీ కనపడ లేదు." వా.
గుడ్డినమ్మకం
- అంధవిశ్వాసం.
- "శకునా లన్నా, గౌళి శాస్త్రం అన్నా వాడికో గుడ్డినమ్మకం." వా.
గుడ్డిలో మెల్ల
- కొంత మేలు.
- "వాళ్లంతా వట్టి కఠినులు. ఈ అబ్బాయే వాళ్లల్లో కల్లా కాస్త గుడ్డిలో మెల్ల." వా.
గుడ్డివడు
- అంధకారబంధుర మగు.
- "కొన్ని దేశంబు లిరులచే గుడ్డివడియె." కాశీ. 1. 137.
గుడ్డెద్దు చేలో బడినట్లు
- ఇష్టం వచ్చినట్లు, చాలూ మూలా లేకుండా.
- గుడ్డెద్దు కేదీ కనబడదు కనుక దొరికిం దల్లా తింటూ, ఎటు పడితే అటు తొక్కుతూ నానాబీభత్సం చేస్తుంది అనుటపై వచ్చిన పలుకుబడి.
- "గుడ్డెద్దు చేలో బడ్డట్లు పోలీసు లా నాడు జనంలో పడి దొరికినవాళ్ల నల్లా బాదారు." వా.
గుడ్లగూబ చూచినట్లు చూచు
- క్రూరముగా, వికారముగా చూచు.
- "వాడు చూడు. గుడ్లగూబ చూచినట్లు చూస్తున్నాడు." వా.
గుడ్లల్లో కూన
- ఎత్తిపొడుపుగా మరీ చిన్న వాడు లే అనునప్పుడు అనే మాట.
- "అవును పాపం! నీ కొడుకు గుడ్లల్లో కూన. ఏమీ తెలీదు." వా.
- రూ. గ్రుడ్డులోపలి చిన్నకూన.
గుడ్లు అప్పగించి
- ఏమీ చేయ లేక.
- "నలుగురూ చేరి వాణ్ణి నలగ దంచుతూ ఉంటే వీడు గుడ్లు అప్పగించి నిలుచున్నాడు. వీ డేం మనిషి ?" వా.
గుడ్లు తేలవేయు
- ఏమీ చేయలేక తన పని ముగిసినట్లు తెలియజేయు.
- ప్రాణం పోవునప్పుడూ, మూర్ఛ పోవునప్పుడూ గుడ్లు తేల వేయుటపై వచ్చిన పలుకుబడి.
- "తీరా వ్యవహారం వచ్చేసరికి వాడు గుడ్లు తేలవేశాడు." వా.
గుడ్లు వెళ్లుక వచ్చు
- చనిపోవు.
- కనుగ్రుడ్లు బయటికి వచ్చు. చంపినప్పుడు, చస్తున్న పుడు అలా జరుగుతుంది.
గుణ మిచ్చు
- పని చేసి మేలు కలిగించు.
- "ఆ మందు వేయగానే గుణ మిచ్చింది." వా.