పుట:PadabhamdhaParijathamu.djvu/345

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఓడ____ఓడ 319 ఓడి____ఓన

తప్పదు; నీటిపై బండ్లు ఓడలపై వెళ్ళక తప్పదు.

 • "సర్వదైవతకులాధిప! యోడలు బండ్ల వచ్చు బం, డ్లోడల వచ్చు నొండొరుల కొక్కొకచో..." ప్రభా. 1. 94.

ఓడ వచ్చు

 • ఓడిపోవుటకు సిద్ధ మగు.
 • "నీయాట యోడ వచ్చినది యనియె." కళా. 6. 117.

ఓడ విడిచి వద రిడు కొను

 • గట్టిప్రాపును వదలి అనుమానాస్పద మైనప్రాపును పట్టుకొనెడిపట్ల ఉపయోగించే పలుకుబడి. ఓడను వదలిపెట్టి సొరకాయను పట్టుకొనుట అట్టిదే కదా! తాళ్ల. సం. 11. 3. భా. 38.

ఓడ విడిచి వదరు పట్టు

 • సులభోపాయ ముండగా తెలిసి తెలిసి అనుమానాస్పద మైన సాధనమును గ్రహించు.
 • "సురత, క్రీడాసౌఖ్యంబు వెడలి క్లిష్ట వ్రతచ, ర్యాడంబరముల దగులుట, యోద విడిచి వదరు పట్టు టుర్వీనాథా!" రుక్మాం. 4. 65.
 • "శకవరేంద్ర చంర చరణాబ్జసం సేవ,విడిచి యావిదర్భవిభుని గలసి, వచ్చు టోడ విడిచి వదరు పట్టుట సుమీ, చెప్ప దగినమాట చెప్పినాడ." విక్ర. 4. 64.
 • వాడుకలో రూపం:
 • "ఓడను వదలిపెట్టి సొరకాయను పట్టు కొన్నట్లు."
 • "అంత పెద్దకంపెనీని వదలిపెట్టి వాడేదో పదెక్కు విస్తా డని ఆ చిన్న కొట్టులో చేరడ మేమిట్రా? ఓడ విడిచి వదరు పట్టినట్లు?" వా.
 • చూ. ఓడ విడిచి వదరిడుకొను.

ఓడికలు గట్టు

 • కాలువలు గట్టు.
 • "అశ్రువ్రజం బోడికల్, గట్టన్ చూపులు చిమ్మ రేగి దివి రోలంబాళి గల్పింపగా." మను. 4. 68.

ఓడికవాగు

 • ఏ దైనా చెఱువుకో, పెద్ద కాలువకో గండిపడి చిన్నగా పాఱువంక - వాగు.
 • "ఓడిపాఱె వరుణు డులుకుచు నోడిక, వాగువోలె." కుమా. 2. 69.
 • "సురసింధు తోయముల గూడిన యోడికవాగుకైవడిన్." జై. 1.99.

ఓడున పోసినయుదకములు

 • ఊఱకే వ్యర్థ మై పోవునవి. ఓటిపాత్రలో పోసిన నీళ్లు.
 • "ఆడంబరంపు దేవార్చన లెల్ల, నోడున బోసినయుదకంబులట్ల." పండితా. ప్రథ. దీక్షా. పుట. 200.

ఓనమాలు రావు

 • ఏమాత్రం చదువు రాదు.
 • "వాడికే ఓనమాలు రావు. వాడు నీ కేం చదువు చెప్తాడు?" వా.