పుట:PadabhamdhaParijathamu.djvu/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏటి____ఏటి 276 ఏటి____ఏటు

ఏటికి చంపెదవు

  • ఎందుకు బాధిస్తావు ? చంపు అన్నమాట వేధించు అనే అర్థంలో విశేషంగా వినవస్తుంది.
  • "ఈ వెడమాటల, నను నేటికి చంపెదరు వినన్ సైపవు." కళా. 4. 73.
  • "ఎందుకు రా ? ఊరికే నన్ను చంపుతావు ? నాకు చేత నైతే చెయ్యనూ ?" వా.
  • "ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించ మని న న్నెందుకు చంపుతావురా." వా.
  • "చంపేశాడురా వాడు." వా.
  • చూ. చంపుక తిను.

ఏటికి నెత్తిగొట్టుకొనగా

  • అవన్నీ యెందుకు అని నిరసనగా అనుట.
  • "ఏటికి నెత్తి గొట్టుకొనగా సన్న్యాసమున్ న్యాసమున్." పాండు. 4. 98.
  • "అవన్నీ ఎందుకు తెచ్చావు ? నెత్తిన కొట్టుకోడానికా?" వా.
  • నేటి వాడుకలో:
  • "అ వెందుకు ? నెత్తిన కొట్టుకోనా?"

ఏటికోళ్లు

  • నమస్కారములు.
  • "దైవంబుల కేటికోళ్లు." భార. ద్రో. 2. 347.
  • "ఏటికోళ్లు సమర్పించి." భీమ. 2. 101.

ఏటిదరిమ్రాను

  • సన్నిహితప్రమాద మయినది. ఏటిగట్టున ఉన్న చెట్టు ఏనిమిష మైనా పడిపోవచ్చు గదా - ఏరు గట్టును కోసి వేస్తుంది గనుక.
  • "నా మాట లెల్ల నయ్యెడ, శ్యమా! చెవుడునకు బట్టు శంఖము లయ్యెన్, నీ మగని రాజ్యవిభవో, ద్దామము దం పోయ నేటిదరిమ్రా నయ్యెన్." నలచ. 5. 142.

ఏటిలోపలి ఊచు

  • కనబడని ప్రమాదము. రామలిం. 31.

ఏటిలో పైరు

  • అశాశ్వతము. ఎంత బాగా పంట పెట్టినా ఏటిలో పంట ఎప్పుడు ఏరు వచ్చినా కొట్టుకొని పోయేదే కదా!
  • తాళ్ల. సం. 11. 3 భ. 150.

ఏటుపోటుతల

  • యుద్ధభూమి.
  • "....ఇవి యేల రిత్తమాట లేటుపోటు తలకు వచ్చి..." భార. కర్ణ. 3. 197.

ఏటుపోటుమాట లను

  • దెప్పి పొడుచు.
  • "ఆ ఆడపడుచు అనుక్షణం ఏటిపోటు మాట లంటూ ఉంటే, ఆకోడలు కాబట్టి ఓర్చుకుంటూ ఉంది." వా.

ఏటుపోటులు

  • దెబ్బలు. ఏటులు - పోటులు. జం.
  • "పాయ ల్వాఱియు నేటుపోటుల భయభ్రాంతంబు లయ్యున్." కా. మా. 2. 44.