పుట:PadabhamdhaParijathamu.djvu/303

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఏటే____ఏదా 277 ఏడి____ఏడు

ఏటేట

 • ప్రతిసంవత్సరము. ఇట్లే 'ఏటా' అని కూడా.
 • "ఎడనెడ సౌరాష్ట్రమేగి యేటేట గడునర్థితోడ జాగరము సెల్లించు." బస. 6. 168.
 • "నేబోదు మల్లయ్య నేటేట గొలువ." పండితా. ద్వితీ. పర్వ. పుట. 374.
 • "ఏటేటా స్వామికి ఉత్సవం జరుగుతుంది." వా.

ఏట్రింతరాయబారము

 • గొప్ప పనికి అల్పుల ప్రయత్నము. ఏట్రింత ఎంత చిన్న పిట్టో ఏనుగ అంత పెద్దది.
 • చూ. ఏనుగ మైథునానికి ఏట్రింత రాయబారము. సా.

ఏడ కేడ

 • నేటిరూపం ఎక్కడి కెక్కడ. దానికీ దీనికీ సంబంధమే లే దనుట.
 • "దాని కేటి వీనితగు లేడ కే డంచు." పాణి. 2. 109.
 • "నువ్వేదో మహా చెప్తావు. వాడికీ వీడికీ ఎక్కడి కెక్కడ?" వా.

ఏడాకు లెక్కువ చదువు

 • ఎక్కువ నేర్పరి యనుట. వానికంటె, దానికంటె అనే మాటవంటి దేదో ఈ పలుకు బడికి ముందు ఉంటుంది.
 • "ఏరాజు వితరణస్మృతిలోన గర్ణున కవల నేడాకు లెక్కువ పఠించె." శ్రీనివా. 2. 41.

ఏడిపించి ఏడు చెఱువుల నీరు త్రాగించు

 • నానాబాధలు పెట్టు.
 • "వాణ్ణి ఇంతటితో వదులుతానా? ఏడిపించి ఏడు చెఱువులు నీళ్లు తాగిస్తాను." వా.
 • చూ. ముప్పుతిప్పల బెట్టి మూడు చెరువుల నీరు త్రాగించు.

ఏడిపించుకొని యేడు చెఱువుల నీళ్లు త్రాగించు

 • ముప్పుతిప్పలు పెట్టు.
 • మావాణ్ణి వాడు ఏడిపించుకొని యేడు చెఱువుల నీళ్లు త్రాగించా డంటే నమ్ము." వా.

ఏడిపించుకొని తిను

 • వేధించు.
 • "ఆ అత్త, కోడల్ని అయినదానికీ కాని దానికీ యేడిపించుకొని తింటూ ఉంది." వా.

ఏడ్చి మొగము కడుగుకొనినట్లు

 • ఈ పని బాగా లేదు అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
 • "వాడి సంగీతం యేడ్చి మొహం కడుగు కొన్నట్లు ఉంది." వా.
 • ఏడ్చినతరవాత మొహం కడుక్కున్నా నీటి చారలు పోవడం తప్పితే నిర్మలం గానూ అందంగానూ ఉండ దనుటపై ఏర్పడినది.

ఏడుకట్ల సవారీ

 • పాడె.