ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఎటు___ఎటొ 253 ఎట్టి___ఎట్లై
- "మఱి ప్రధానుల వెట్టి మంతనా లెటు నన, రానివి పేగులలోని తీట..." కళా. 7. 19.
ఎటులైన కమ్ము నీవు
- నీవు ఎలా అయినా అయిపో.
- "...ఎటు లైన గమ్ము నీవు." పాండు. 5. 229.
- ఇది వాడుకలో 'నీ వెట్లా అయినా అయి పో' 'నీ వెట్లపోతే నాకేమి' - మొదలయిన రూపాలలో నేటికీ వినబడుతుంది.
ఎటువంటి పెద్దవారు?
- ఏం పెద్ద మనుష్యులు? అనగా ఇతరులు చేసిన పని సరిగా లే దనునపుడు అను మాట.
- "మీ రెటువంటి పెద్దవా రెంచ రొకింతయుం..." కళా. 3. 36.
- నేటి వాడుక రూపం:
- "ఏం పెద్దమనుష్యు లయ్యా ! మీరు ? మొన్ననగా వస్తా నని చెప్పి రానే లేదు." వా.
ఎటూ
- ఎలాగూ, తప్పక.
- "వీనిచేత నెట్టు కౌరవులకు నెగ్గు వుట్టు." భార. అర. 1. 49.
- "ఎటూ వెడతాం కనక ఆయన్ను కూడా చూచి వెడదాము." వా.
ఎటొచ్చీ
- ఇంతకూ అనుట వంటి ఊతపదం. మాటా. 29.
ఎట్టిపాటు పఱిచినా
- ఎన్ని పాట్లు పెట్టినా, ఎంత బాధ పెట్టినా. వాడుకలో ఎన్నిపాట్లు పెట్టినా అనే అలవాటు.
- "ఎంత పాటుపడ్డా వాడికి కడుపు నిండడమే గగనంగా ఉంది." వా.
ఎట్లు కాదగిన కార్యము లట్లగు
- అయ్యేదవుతుంది అనుట. యద్భావి తద్భవతి అని సంస్కృతం.
- "కాంతరొ ! యెట్లు కాదగినకార్యము లట్లగు మున్గళావతీ, కాంతకు మోహనాంగు నుపకాంతుని..." శుక. 1. 239.
ఎట్లు చూడగలను ?
- ఎలా చూడగలను ?
- చూడ లే ననుట.
- "అపత్యంబులదు:ఖం బే నెట్లు సూడ నోపుదు." భార. ఆర. 1. 86..
ఎట్లో ఒక్కచందాన
- ఏదొ ఒక విధంగా. అయిష్టంతో అనుట.
- "వీడ్కో జాలక చాల కంత మది యెట్లో యొక్క చందాన వీడ్కొనియెన్." కళా. 7. 97.
- వాడుకలో:
- "ఏదో ఒక విధంగా వెళ్ళి పోక తప్పదు." వా.
ఎట్లైన నగు
- ఏమైనా కానీ.