పుట:Oka-Yogi-Atmakatha.pdf/887

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1940 - 1951 మధ్యకాలం

851

“నిశ్చలంగా ఉండి, నేను దేవుణ్ణని తెలుసుకో.”[1] ఈశ్వరుడి సర్వవ్యాపిత్వాన్ని ఎన్నడూ కాదనకుండా, ఆయన పలుకులను గంభీర మౌనస్థితుల్లోనే మనం వినగలం. సృజనాత్మక ఓంకార స్పందన విశ్వమంతటా ప్రతిధ్వనించే అది నాదబ్రహ్మం. తనతో అనుసంధానం పొందిఉన్న భక్తుడికోసం, గ్రహణానుకూలమయిన పదాలుగా, అప్పటికప్పుడు మార్పుచెందుతుంది.

మానవ హేతుబుద్ధి గ్రహించుకోగలిగినంతవరకు, సృష్టికి గల దివ్యప్రయోజనాన్ని వేదాల్లో వివరించడం జరిగింది. ప్రతి మనిషి ఆత్మగా, భగవంతుడు సృష్టించినవాడేననీ, ఆ ఆత్మ తన కేవల వ్యక్తిత్వాన్ని తిరిగి పొందేముందు, అనంతత్వానికున్న ఒకానొక ప్రత్యేక లక్షణాన్ని విశిష్టంగా అభివ్యక్తం చేస్తుందనీ ఋషులు చెప్పారు. ఆ విధంగా దివ్య వ్యక్తిత్వానికి సంబంధించిన ఒక యథార్థం ప్రాప్తించిన మానవులందరూ దేవుడికి సమాన ప్రీతిపాత్రులు.

ప్రపంచదేశాలకు పెద్దన్న అయిన భారతదేశం ప్రోదిచేసుకున్న జ్ఞానం సర్వమానవాళికీ చెందే వారసత్వం. యావత్ సత్యం లాగే వైదిక సత్యం, భగవంతుడిదే కాని, భారతదేశానిది కాదు. వేదాల దివ్యగంభీర సత్యాల్ని గ్రహించుకోగల పరిశుద్ధ పాత్రలవంటి మనస్సులుగల మహా ఋషులు, ఈ భూమిమీద పుట్టిన మానవజాతి సభ్యులేకానీ, సర్వమానవాళికీ సేవచేయడానికి మరో లోకంలో ఎక్కడో పుట్టినవాళ్ళేమీ కారు. సత్యనిష్ఠమైన లోకంలో జాతినిబట్టి కాని, దేశాన్నిబట్టి కాని చూపించే భేద భావాలు అర్థంలేనివి; అక్కడ కావలసిన ఏకైక యోగ్యత, దాన్ని అందుకోడానికి ఆధ్యాత్మిక అర్హత మాత్రమే.

దేవుడంటే ప్రేమ, సృష్టికి ఆయన నిర్ణయించిన ప్రణాళిక ప్రేమ

  1. సామ్స్, 46:10 (బైబిలు).