పుట:Oka-Yogi-Atmakatha.pdf/886

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

850

ఒక యోగి ఆత్మకథ

కారణంవల్లే నే నీ లోకంలోకి వచ్చాను. సత్యానికి కట్టుబడ్డ ప్రతివాడూ నా స్వరం వింటాడు.”[1] ఈ మాటల్లో క్రీస్తు ఎంతెంతో ఇమిడ్చి చెప్పాడు. దేవుడి పుత్రుడు కేవలం ‘తన జీవితం’ వల్ల “సాక్షిగా నిలుస్తాడు.” అతడు సత్యరూపుడవుతాడు; అతడు దాన్ని కూడా వివరించడానికి పూనుకుంటే, అది ఉదారంగా చేసిన అత్యుక్తి అవుతుంది.

సత్యమన్నది ఒక సిద్ధాంతం కాదు, తత్త్వశాస్త్రంలో ఉన్న చింతనా విధానం కాదు, బుద్ధిపరమైన అంతర్‌జ్ఞానమూ కాదు. సత్యమనేది, వాస్తవానికి కచ్చితమైన అనురూపం. మానవుడి దృష్టిలో, సత్యం, ఆత్మరూపమైన తన వాస్తవ ప్రకృతిని గురించిన అచంచల జ్ఞానం. ఏసుక్రీస్తు, తన జీవితంలో ప్రతి చర్య ద్వారా, ప్రతి మాట ద్వారా, తన అస్థిత్వ సత్యాన్ని ఈశ్వరుడే తనకు మూలమన్న సంగతి మనకు తెలుసునని నిరూపించాడు. తనను సర్వవ్యాప్తమైన కూటస్థ చైతన్యంగా పూర్తిగా గుర్తించుకొన్న అతడు, సులువుగా తుదిపలుకుగా ఇలా చెప్పాడు; “సత్యానికి కట్టుబడ్డ ప్రతివాడూ నా స్వరం వింటాడు.” అని.

బుద్ధుడు కూడా అధిభౌతిక పరమతత్త్వాల్ని వివరించడానికి నిరాకరించాడు; భూమిమీద మానవుడికున్న కొద్ది క్షణాలనూ, నైతిక ప్రకృతిలో పరిపూర్ణత సాధించడానికి వినియోగించడం మంచిదని పొడిమాటల్లో చెప్పాడు. చైనాదేశపు మార్మికుడు లావో-ట్జు సరిగా చెప్పాడు.

“తెలిసినవాడు దాన్ని చెప్పడు; చెప్పినవాడికి అది తెలిసి ఉండదు.” భగవంతుడి చరమరహస్యాలు “చర్చకు పెట్టడానికి వీలయిన” విషయాలు కావు. ఆయన గూఢ సంకేతలిపిని అర్థం చేసుకోడమన్నది, మనిషి మరో మనిషికి నేర్పలేని కళ; ఇక్కడ దేవుడొక్కడే గురువు.

  1. యోహాను 18 : 37 (బైబిలు).