పుట:Oka-Yogi-Atmakatha.pdf/888

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

852

ఒక యోగి ఆత్మకథ

లోనే పాదుకోగలదు. ఆ చిన్న ఆలోచన, పాండిత్యమండితమైన తర్క వితర్కాలకన్న ఎక్కువగా మానవ హృదయానికి ఊరట కలిగించడం లేదూ? ప్రతి సాధువూ సత్యగర్భంలోకి చొచ్చుకుపోయి దివ్యమైన విశ్వ ప్రణాళిక ఒకటి ఉంటుందనీ అది సుందరమైనదనీ ఆనందమయమయినదీ ద్రువపరుస్తాడు. దేవుడు తన ఉద్దేశాల్ని యెషయా ప్రవక్తకు ఈ మాటల్లో చెప్పాడు:

“నా నోటినుంచి వెలువడ్డ మాట (సృజనాత్మకమైన ఓంకార నాదం) నా దగ్గరికి వృథాగా తిరిగి రాదు; నేను ఆశించినది చేస్తుందది. నేను దాన్ని దేంట్లోకి పంపితే, అది వర్ధిల్లుతుంది. అతడు ఆనందంగా బయటికి వెళ్తాడు. అతన్ని శాంతితో ముందుకు నడిపించడం జరుగుతుంది. కొండలూ గుట్టలూ నీ ముందు విరిగిపడుతూ గానం చేస్తాయి; భూమి మీది చెట్లన్నీ చప్పట్లు కొడతాయి.”[1]

“నువ్వు ఆనందంగా బయటికి వెళ్ళాలి, నిన్ను శాంతితో ముందుకు నడిపించడం జరుగుతుంది.” కష్టజీవులైన ఇరవయ్యో శతాబ్ది మనుషులు ఆ అద్భుత వాగ్దానాన్ని ప్రగాఢమైన ఆకాంక్షతో వింటారు. దాంట్లో ఉన్న సంపూర్ణ సత్యం, దివ్య ఔరసత్వాన్ని తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకోడానికి దృఢసంకల్పంతో శ్రమించే ప్రతి దైవభక్తుడూ సాక్షాత్కరింప జేసుకోగలిగింది.

ప్రాచ్యపాశ్చాత్యదేశాల్లో క్రియాయోగం నిర్వహించే పాత్ర ఇప్పుడిప్పుడే మొదలయింది. [మానవ దైన్యాన్ని అంతనూ జయించడానికి నిర్దిష్టమైన, శాస్త్రీయమైన ఆత్మసాక్షాత్కార సాధన ప్రక్రియ ఒకటి

ఉందని మానవులందరూ తెలుసుకోవాలి!

  1. యెషయా 55: 12.