పుట:Oka-Yogi-Atmakatha.pdf/880

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

844

ఒక యోగి ఆత్మకథ

ఉండే అతని అవచేతనస్థితి, శరీర శ్వాసలనుంచి మానసికంగానూ తాత్కాలికంగానూ కలిగే వేర్పాటుతో ముడిపడి ఉన్నది. “మనుగడ” అనేది శరీరంమీదా శ్వాసమీదా ఆధారపడి ఉందన్న భ్రాంతినుంచి విముక్తి పొందినది అతని అధిచేతన స్థితి.[1] దేవుడు ఊపిరిలేకుండానే జీవిస్తాడు; అతని రూపంలోనే తయారైన ఆత్మ, ఊపిరిలేని స్థితిలోనే మొట్టమొదటి సారిగా తన ఉనికిని తాను తెలుసుకుంటుంది.

పరిణామాత్మక కర్మవల్ల ఆత్మకూ శరీరానికి ఉన్న ఊపిరి లంకెను తెంపినప్పుడు “చావు” అనే హఠాత్పరిణామం సంభవిస్తుంది. భౌతిక కణాలు వాటికి సహజమైన శక్తిహీనతను తిరిగి పొందుతాయి. అయితే క్రియాయోగికి ఈ ఊపిరి లంకె, కర్మఫలావశ్యకమైన కఠోర ప్రమేయంవల్ల కాకుండా, శాస్త్రీయవిజ్ఞానంవల్ల ఇచ్ఛానుసారంగా విడివడుతుంది. యథార్థ అనుభవం ద్వారా యోగి, సారభూతమైన తన అశరీరత్వాన్ని ముందే ఎరిగి ఉంటాడు; భౌతికదేహం మీద భరోసా ఉంచమన్న దుర్బోధ మనిషి చెవిని పడిందంటూ మృత్యుదేవత వేలెత్తి చూపడం, అతని విషయంలో జరగదు.

  1. నీ నరనరాల్లో సముద్రమే ప్రవహించనంతవరకు, నువ్వు ఆకాశాంబర దారివై నక్షత్రజాల కిరీటాన్ని ధరించి యావత్ప్రపంచానికి నువ్వే ఏకైక వారసుడిగా నిన్ను దర్శించుకోనంతవరకు. అంతకన్న మిన్నగా, ప్రతి ఒక్కడూ నీలాగే ఏకైక వారసులయినవాళ్ళు ఉన్నారు కాబట్టి; పిసినిగొట్టువాళ్ళు బంగారాన్నీ, రాజులు తమ రాజదండాల్నీ చూసుకొని ఆనందించేటట్టుగా నువ్వు దేవుణ్ణి కీర్తిస్తూ సంబరపడుతూ ఆనందానుభూతి పొందేవరకు... నీ నడకా, నీ బల్లా నీకు పరిచయమై ఉన్నంతగా, అన్ని యుగాల్లోనూ దైవలీలలతో నీకు పరిచయం కలిగేటంతవరకు; ప్రపంచ సృష్టికీ మూలమైన - ఛాయామాత్ర శూన్యంతో నీకు అత్యంత సన్నిహితంగా పరిచయం ఏర్పడేటంతవరకు నువ్వు ఈ లోకంలో సమ్యగానందానుభూతి ఎన్నడూ పొందలేవు.” – థామస్ ట్రాహర్న్, ‘సెంచరీస్ ఆఫ్ మెడిటేషన్స్’ (ధ్యాన శతకాలు)లో.