పుట:Oka-Yogi-Atmakatha.pdf/866

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

830

ఒక యోగి ఆత్మకథ

సంతానంగా తమ హోదాను పునఃస్థాపన చేసుకోడానికి సరయిన కృషి చేసినప్పుడు, వాళ్ళకోసం శాంతిసౌభాగ్యాల లోకం కాసుకొని ఉంటుంది; ఆ లోకాన్ని అవతరింపజేయడానికి అవసరమైన క్రియాయోగులు, పదుల్లో కాదు; లక్షల్లో ఉండాలి.

పాశ్చాత్య ప్రపంచంలో సెల్ఫ్ రియలైజేషన్ సంస్థ ఒకటి - “ఆధ్యాత్మిక మధుకోశం” స్థాపించే కర్తవ్యం నాకు విధించినవారు, మా గురుదేవులు శ్రీయుక్తేశ్వర్‌గారూ, నా పరమేష్ఠి, గురుదేవులు బాబాజీ. ఈ పవిత్ర ధర్మాన్ని సఫలం కావించడంలో కష్టాలు ఎదురుకాక మానవు.

“నిజం చెప్పండి పరమహంసగారూ, కృషి ఫలించిందంటారా?” అంటూ, ఒకనాడు సాయంత్రం, శాన్‌డియాగో ఆలయం నాయకుడైన డా॥ లాయిడ్ కెనెల్, నన్ను టూకీగా ఇలా ప్రశ్నించాడు. ఆయన అడగ దలిచింది ఏమిటో నేను అర్థంచేసుకున్నాను. “మీరు అమెరికాలో హాయిగా ఉన్నారా? యోగవిద్యావ్యాప్తిని అరికట్టాలని చూసే అప్రాజ్ఞులు ప్రచారంచేసే అబద్ధాల మాట ఏమిటి? దిగ్భ్రమలూ , హృదయ వేదనలూ, నడిపించలేని ధ్యానకేంద్రనాయకులూ, బోధనకు అలవికాని విద్యార్థులూ, మాట ఏమిటి?” అని అడుగుతున్నాడన్న మాట.

“దేవుడి పరీక్షకు గురి అయేవాడు ధన్యుడు!” అని జవాబిచ్చాను. “నా మీద బరువు మోపాలని అప్పుడప్పుడు గుర్తుచేసుకుంటూ వచ్చాడాయన.” అప్పుడు నేను విశ్వాసపాత్రులందరినీ, అమెరికా హృదయాన్ని దీపింపజేసే, ప్రేమనూ, భక్తినీ, అవగాహననూ తలుచుకున్నాను. మెల్లగా