పుట:Oka-Yogi-Atmakatha.pdf/836

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

800

ఒక యోగి ఆత్మకథ

ఆకర్షణా ప్రశాంతమైన చిరునవ్వూ, మధురమైన గంభీరోపన్యాసం కన్న కూడా మిన్నగా మాకు స్వాగతం చెప్పాయి. ఒళ్ళంతా దుమ్ముకొట్టుకు పోయి కష్టపడి చేసిన ప్రయాణం బడలిక అంతా మరిచిపోయాం.

ఆ సాధ్వి, వరండాలో బాసెంపట్టు వేసుకుని కూర్చున్నారు. ఒంటిమీద వయోభారం కనిపిస్తున్నా, బక్కచిక్కి పోలేదు; బూడిద వన్నెలో ఉన్న ఆవిడ చర్మం స్వచ్ఛంగా, ఆరోగ్యంగా ఉంది.

“అమ్మా, ఈ యాత్ర చెయ్యాలని నేను పాతికేళ్ళకు పూర్వం నుంచి ఆత్రంగా అనుకుంటూ వచ్చాను! మీ పావన జీవనాన్ని గురించి స్థితిలాల్ నంది బాబుగారి దగ్గర విన్నాను,” అంటూ బెంగాలీలో చెప్పాను.

“ఔను,” అంటూ తల ఊపా రావిడ, “ఆయన నవాబ్‌గంజ్‌లో మా పక్కింట్లో ఉండేవారు; మంచివారు.”

“ఈ మధ్యకాలంలో నేను మహాసముద్రాలు దాటి వెళ్ళాను; కాని ఎప్పుడో ఒకనాడు మిమ్మల్ని చూడాలన్న సంగతి ఎన్నడూ మరిచిపోలేదు. మీ రిక్కడ చాలా అజ్ఞాతంగా నిర్వహిస్తున్న దివ్యలీలను, లోపలి అన్నబ్రహ్మాన్ని చాలాకాలంగా మరిచిపోయిన ప్రపంచానికి ఘనంగా వెల్లడి చెయ్యాలి.”

ఆ సాధ్వి ప్రశాంతమైన ఆసక్తితో చిరునవ్వు నవ్వుతూ, ఒక్క నిమిషం కళ్ళు పైకి ఎత్తారు.

“బాబాకే బాగా తెలుసు,” అంటూ వినమ్రంగా జవాబిచ్చారు.

ఆవిడ అన్యథా భావించనందుకు నేను సంతోషించాను; యోగులూ యోగినులూ ప్రచారానికి ఎలా స్పందిస్తారో ఎవరికీ ఎన్నడూ తెలియదు.