పుట:Oka-Yogi-Atmakatha.pdf/837

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిరాహార యోగిని

801

గాఢమైన ఆత్మపరిశీలన నిశ్శబ్దంగా సాగించాలన్న కోరికతో, వారు ప్రచారాన్ని నియమప్రకారం తిరస్కరిస్తారు. అన్వేషణమనస్కుల ప్రయోజనంకోసం తమ జీవితాల్ని బహిరంగంగా ప్రదర్శించడానికి సరయిన సమయం ఆసన్నమైనప్పుడు, వాళ్ళకొక అంతఃప్రేరణ కలుగుతుంది.

“అయితే అమ్మా, అనేక ప్రశ్నలతో మిమ్మల్ని విసిగిస్తున్నందుకు క్షమించండి. దయచేసి, మీకు ఇష్టమైనవాటికే జవాబు లివ్వండి; మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకుంటాను నేను,” అంటూ కొనసాగించాను.

ఆవిడ ప్రసన్నంగా చేతులు చాపారు. “నాలాంటి సామాన్య వ్యక్తి తృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగినంత మట్టుకు, సంతోషంగా ఇస్తాను.”

“అఁహఁ. మీరు సామాన్యులు కారు!” అని మనఃపూర్తిగా అభ్యంతరం చెప్పాను. “మీరు మహితాత్మలు!”

“నే నందరికీ వినమ్రదాసిని.” ఆవిడ చిత్రంగా ఇంకా ఇలా అన్నారు, “వంట చెయ్యడమన్నా, వడ్డన చెయ్యడమన్నా నాకు ఇష్టం.”

“తిండి తినని సాధ్వికి ఇది విడ్డూరమైన కాలక్షేపమే,” అనుకున్నాను.

“అమ్మా, మీ నోటినించి వినాలని ఉంది; ఒక్క మాట చెప్పండి? మీరు అన్నం తినకుండానే ఉంటున్నారా?”

“అది నిజం.” కొన్ని క్షణాలు ఆవిడ మౌనం వహించారు; ఆ సమయంలో ఆవిడ, మనస్సులో ఏవో లెక్కలు వేసుకుంటూ సతమత మవుతున్నారన్న సంగతి, ఆ తరవాత చేసిన వ్యాఖ్యానాన్ని బట్టి తెలిసింది.