పుట:Oka-Yogi-Atmakatha.pdf/835

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిరాహార యోగిని

799

చూశారు. ఆవిడ కళ్ళు తలమీది ముసుగు నీడలో మంటలేని నిప్పుల్లా మెరిశాయి. అత్యంత దయామయమైన ఆవిడ ముఖం చూసి ఆకృష్టులమయాం - లౌకిక అనుబంధంతో మలినం కాకుండా ఆత్మదర్శనమూ అవగాహనా ఉట్టిపడే ముఖమది.”

“ఆవిడ వినయపూర్వకంగా దగ్గరికి వచ్చి, మేము ‘స్టిల్’ కెమేరాతోనూ ‘మూవీ’ కెమేరా[1] తోనూ కొన్ని ఫొటోలు తీసుకోడానికి అంగీకరించారు. భంగిమల సర్దుబాటుకూ వెలుతురుపడే ఏర్పాటుకూ సంబంధించిన మా ఫొటో టెక్నిక్‌లను ఆవిడ, సిగ్గుపడుతూ ఓరిమితో సహించారు. చివరికి మేము, ఏభై సంవత్సరాలకు పైగా అన్నపానాలు లేకుండా జీవించినట్టు తెలుస్తున్న ప్రపంచంలోని ఏకైక మహిళ ఫొటోలు అనేకం, భవిష్యత్ తరాలవారికోసం తీశాం. (థెరీసా నాయ్‌మన్ అయితే 1923 నుంచే ఉపవాసం చేస్తోంది). ఒదులుగా జారుతున్న బట్ట పూర్తిగా కప్పుకొని, గిరిబాలగారు మా ముందు నించుని ఉంటే, ఆవిడ ముఖకవళిక అత్యంత మాతృసహజంగా ఉంది; కళ్ళు వాల్చుకొని ఉన్న ముఖం, చేతులు, కురచ పాదాలూ తప్ప, ఆవిడ శరీరం ఇంకేమీ కనిపించలేదు. అరుదైన ప్రశాంతి, అమాయకత్వం ఉట్టిపడే ముఖం - చిన్న పిల్లకుండే మాదిరి వెడల్పాటి, వణికే పెదవి, స్త్రీ సహజమైన ముక్కు, సన్నగా మిలమిల మెరిసే కళ్ళు, రవ్వంత చిరునవ్వూ.”

గిరిబాలగారి గురించి శ్రీ రైట్‌కు కలిగిన అభిప్రాయమే నాకూ కలిగింది. ఆవిడ వేసుకున్న లేతవన్నె ముసుగులాగే, ఆధ్యాత్మికత ఆవిణ్ణి ఆవరించింది. ఒక గృహస్థురాలు సన్యాసికి ప్రణామం చేసే ఆచారం ప్రకారం ఆవిడ నాకు ప్రణామం చేశారు. ఆవిడలోని నిరాడంబరమైన

  1. శ్రీ రైట్, శ్రీరాంపూర్‌లో చివరి ధనుర్మాస సంక్రమణోత్సవ సందర్భంగా శ్రీ యుక్తేశ్వర్‌గారి, చలన చిత్రాలు కూడా తీశాడు.