పుట:Oka-Yogi-Atmakatha.pdf/832

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

796

ఒక యోగి ఆత్మకథ

పాతకాలపు నిర్మల గ్రామాలగుండా, తాటితోపులగుండా సాగింది,” అంటూ శ్రీ రైట్, తన యాత్రా దినచర్య పుస్తకంలో, 1936 మే 5 తేదీ పుటలో రాసింది ఇలా ఉంది. “బురదమట్టితో కట్టిన ఈతాకు గుడిసెల గుంపులు చాలా ఆకర్షకంగా ఉన్నాయి; గుడిసెల తలుపుల మీద దేవుడి పేర్లలో ఒకటి, అలంకారంగా రాసి ఉంటుంది. దిస మొలలతో ఉన్న చిన్న పిల్లకాయలు చాలామంది, అమాయకంగా ఆడుకుంటున్నారు; తమ పల్లెలోకి పిచ్చిగా దూసుకు వస్తున్న, నల్లగా పెద్దగా ఉన్న, ఎడ్లులేని బండిని తేరిపారి చూస్తున్నారు; లేదా చెల్లా చెదరుగా పారిపోతున్నారు. మగవాళ్ళు దారిపక్క చెట్లకింద పాలుమాలికగా చేర్లబడి ఉండగా ఆడవాళ్ళు మట్టుకు, నీడల్లోంచి తొంగి చూస్తున్నారు. అయినా వాళ్ళ చూపుల వెనక కుతూహలం కనబడుతోంది. ఒకచోట పల్లెప్రజలు ఒక పెద్ద చెరువులో కులాసాగా స్నానాలు చేస్తున్నారు. (బట్టలు మార్చుకోడానికి, పొడిబట్ట ఒంటికి చుట్టుకొని తడిబట్టలు కిందికి జారవిడుస్తున్నారు). ఆడవాళ్ళు పెద్ద పెద్ద ఇత్తడి బిందెలతో ఇళ్ళకి నీళ్ళు తీసుకువెళ్తున్నారు.

“దారి మిట్టపల్లాలుగా ఉండడంతో మాకు బలే తమాషాగా ఉంది; మేము ఎగిరెగిరిపడుతూ, ఊగిసలాడిపోతూ, వాగుల్లో పడి, నిర్మాణం పూర్తికాని ఒక కాలిబాటకు చుట్టు తిరిగి, పొడి ఇసక ఉన్న నదీగర్భాలకు అడ్డబడి జారుతూ, చివరికి సాయంత్రం 5 : 00 గంటల ప్రాంతానికి మా గమ్యస్థానం- బియూర్‌కు చేరుకున్నాం. బంకూరా జిల్లాలో ఉన్న ఈ కుగ్రామం దట్టమైన హరితవృక్షాల ఒడిలో మరుగుపడి ఉంది; వానా కాలంలో వాగులు పొంగి వెల్లువలై పారుతూ ఉండగా, పాముల్లాటి రోడ్లు విషంవంటి బురద కక్కుతూ ఉన్నప్పుడు ప్రయాణికులు ఆ ఊరు చేరలేరు.