పుట:Oka-Yogi-Atmakatha.pdf/831

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిరాహార యోగిని

795

“సార్, ఫొటోలకి కావలసినంత వెలుతురు ఉండాలంటే పొద్దు కుంకకముందే మనం గిరిబాలగారి దగ్గరికి చేరుకోవాలండి,” అన్నాడు రైట్. ఆ తరవాత చిన్నగా చిరునవ్వు నవ్వుతూ, ఇంకా ఇలా అన్నాడు: “పడమటివాళ్ళంతా సంశయమనస్కులు; ఫొటోలు లేకపోయినట్లయితే ఆవిణ్ణి గురించి చెప్పేది వాళ్ళు నమ్ముతారని అనుకోడానికి వీల్లేదు!”

ఈ జ్ఞాన శకలం వివాద రహితమైనది; జిహ్వాకర్షణ నుంచి నేను వెనక్కి తిరిగి మళ్ళీ కారులోకి వచ్చి కూర్చున్నాను.

“నువ్వన్నది నిజం, డిక్,” అంటూ నిట్టూర్చాను, కారులో అడుగుపెడుతూ. “పడమటివాళ్ళ వాస్తవికతాభిమానాన్ని మన్నించడం కోసం నా మామిడిపండ్ల స్వర్గాన్ని త్యాగం చేస్తాను; పోటోగ్రాఫులు తప్పకుండా కావాలి!”

వృద్ధాప్యంలో కనిపించే అవలక్షణాల్లా, మొహంమీది ముడతల్లాటి గాళ్ళతోనూ, సెగ్గడ్డల్లా గట్టిపడ్డ బంకమట్టితోనూ మరింత ప్రయాస పెడుతూ వచ్చింది, దారి. శ్రీ రైట్, ఫోర్డుకారును ఇంకా సులువుగా నడపడానికి వీలుగా, మేము అప్పుడప్పుడు దిగి వెనకనించి తోస్తూ వచ్చాం.

“లంబోదర బాబుగారు నిజమే చెప్పారు. కారు మన్ని మొయ్యడం లేదు, మనమే కారును మోస్తున్నాం!” అన్నాడు శైలేశ్.

దూరానికి ఒక పల్లె కనిపించేసరికి, ఈ దిగడాల్లోనూ ఎక్కడాల్లోనూ మాకు కలుగుతున్న విసుగు మరుగుపడుతూ వచ్చింది; ప్రతి పల్లె, చిత్రమైన నిరాడంబరత చూపే దృశ్యం.

“మా దారి మలుపులు తిరిగి, అడవి నీడలో ఒదిగి ఉంటున్న