పుట:Oka-Yogi-Atmakatha.pdf/820

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

784

ఒక యోగి ఆత్మకథ

ఈ సమాధానంతో, దగ్గరున్న శిష్యులు గాభరాపడుతూ ముందుకు వచ్చారు.

“మేము ఇరవై మందికి పైగా ఎప్పుడూ ఆనందమయి మాతతో ప్రయాణం చేస్తూ ఉంటాం,” అని దృఢంగా చెప్పారొకరు. “ఆవిడ లేనిదే మేము బతకలేం. ఆవిడ ఎక్కడికి వెడితే అక్కడికి మేమూ వెళ్ళవలసిందే.”

ప్రయాణికుల సంఖ్య దానంతట అది పెరిగిపోయే ఇబ్బంది ఎదురయినందువల్ల, మనస్సు పీకుతూనే ఉన్నా, నా ఆలోచనను విరమించుకున్నాను!

“కనీసం రాంచీ అయినా రావాలి, శిష్యులతో,” అన్నాను ఆ సాధ్విదగ్గర సెలవు తీసుకుంటూ. “నువ్వే ఒక దివ్య శిశువువయినందువల్ల నా విద్యాలయంలో ఉన్న పిల్లల్ని చూసి ఆనందిస్తావు.”

“బాబా ఎప్పుడు తీసుకువెడితే అప్పుడు సంతోషంగా వస్తాను.”

తరవాత కొంత కాలానికి రాంచీ విద్యాలయానికి, ఆ సాధ్వి ఆగమన సందర్భంగా పండుగ కళ నచ్చింది. ఆ పండుగరోజు కోసం ఎంతగానో కాసుకొని ఉన్నారు కుర్రవాళ్ళు - పాఠాలు లేవు; గంటలకు గంటలు ఎడతెరిపిలేకుండా సంగీతం; దానికి రసపట్టుగా ఒక విందు!

“జయ్! ఆనందమయి మా కీ జయ్!” ఆ సాధ్వీమణి బృందం విద్యాలయ ద్వారంలో అడుగుపెడుతూ ఉండగా, ఉత్సాహం ఉరకలు వేస్తున్న అనేక పసిగొంతుల్లో ఈ నినాదం మోగిపోయింది. బంతిపూల వాన, తాళాల చప్పుళ్ళు, నిండుగా పూరించిన శంఖాలు, మద్దెలల మోతలు! ఆనందమయి మాత చిరునవ్వు చిందిస్తూ, పరుచుకున్న ఎండతో ఆహ్లాదకరంగా ఉన్న విద్యాలయ భూమిలో హాయిగా విహరించింది; ఆవిడ