పుట:Oka-Yogi-Atmakatha.pdf/812

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

776

ఒక యోగి ఆత్మకథ

కోల్పలేక పోయింది,” అని చెప్పాడు, ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్. “జయాపజయాలు, ఒకదానిలాగే మరొకటి నిస్సారమయినవి. ప్రపంచం ఆపాఠం నేర్చుకొని ఉండవలసింది.”

“హింసాత్మకమైన ఆయుధాలు ఎక్కువయినకొద్దీ మానవజాతికి దైన్యం ఎక్కువవుతుంది,” అని బోధించాడు లావోట్జు. “హింసకు లభించే విజయం సంతాపోత్సవంతో ముగుస్తుంది.”

“నేను పోరాడుతున్నది. ప్రపంచ శాంతికోసమే కాని మరి దేని కోసమూ కాదు,” అని చాటి చెప్పారు గాంధీగారు. “భారతీయ ఉద్యమం, అహింసాయుత సత్యాగ్రహ ప్రాతిపదిక మీద సాగినట్లయితే అది దేశ భక్తికి కొంత అర్థం ఇస్తుంది – అంతేకాదు, జీవితానికి కూడా నని నేను సవినయంగా మనవి చేస్తాను.”

గాంధీగారి కార్యక్రమాన్ని అలవిగాని కలలు కనేవాడి కల్పనగా కొట్టి పారేసేముందు పాశ్చాత్య దేశాలు, సత్యాగ్రహాన్ని గురించి గలీలీ గురువు ఇచ్చిన నిర్వచనాన్ని గురించి ఆలోచించడం మంచిది.

“కంటికి కన్నూ పంటికి పన్నూ అని చెబుతూ ఉండడం మీరువిన్నారు; కాని నే నంటాను, నువ్వు చెడును (చెడుతో) అరికట్టకు: అంతకన్న, ఎవరయినా నీ కుడి చెంపమీద ఒక్క పెట్టు పెడితే, అతనికి నీ రెండో చెంప కూడా చూపించు.” (మత్తయి 5 : 38-39).

ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలతో నిర్వీర్యమై విధ్వంసమైన శతాబ్దిలో, కచ్చితమైన భగవత్కాల నిర్ణయానుసారంగా గాంధీ శకం ముగిసింది. ఆయన జీవితం అనే రాతిగోడ మీద దివ్య హస్తాక్షరాలు కనిపిస్తాయి: అది సోదరుల్లో ఇక మళ్ళీ రక్తపాతం జరగగూడదన్న హెచ్చరిక.