పుట:Oka-Yogi-Atmakatha.pdf/797

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీమహాత్ములతో వార్ధాలో

761

“గాంధీగారి భార్య, ఆ మహాత్ముణ్ణి తన భర్తగా కాకుండా గురువుగా భావించింది. చాలా చిన్న పొరపాట్లనయినా చక్కదిద్దే హక్కు గురువుకు ఉంది,” అని స్పష్టం చేశాను. “కస్తూరిబాయిని బహిరంగంగా మందలించిన కొంత కాలానికి, గాంధీగారికి ఒక రాజకీయ నేరారోపణ మీద జైలుశిక్ష పడింది. ప్రశాంతంగా ఆయన ఆమెకు వీడుకోలు చెబుతూ ఉండగా ఆవిడ, ఆయన పాదాల మీద వాలింది. “గురుదేవా, నేను మిమ్మల్ని ఎప్పుడయినా నొప్పించి ఉంటే నన్ను క్షమించండి,” అని ప్రాధేయపడింది.

వార్ధాలో ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు నేను, ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ప్రకారం, గాంధీగారి రాతగదిలోకి వెళ్ళాను, తన భార్యను శిష్యురాలిగా చేసుకోడమనే అరుదైన అలౌకిక ఘటనను సాధించగలిగిన సాధువు గాంధీగారు. ఎన్నడూ మరుపురాని చిరునవ్వు చిందిస్తూ పైకి చూశారు ఆయన.

“మహాత్మాజీ,” అంటూ ఆయన పక్కన, ఉత్తి చాపమీద కూర్చుంటూ, “అహింసకు మీ నిర్వచనమేమిటో చెప్పండి,” అన్నాను.

“మనస్సులో కాని, చేతలో కాని ఏ జీవికీ హాని చెయ్యకుండా ఉండడం.”

“చక్కని ఆదర్శమే! కాని, ఒక పిల్లవాణ్ణి కాపాడడానికో, తనని కాపాడుకోడానికో తాచుపామును చంపగూడదా అని ప్రపంచం ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది.”

“నిర్భయం, అహింస అన్న నా ప్రతిజ్ఞల్ని రెండింటినీ ఉల్లంఘించకుండా నేను తాచుపామును చంపలేను. అంతకంటె, ప్రేమ స్పందనతో ఆ పామును శాంతపరచడానికి మానసికంగా ప్రయత్నిస్తాను. నా