పుట:Oka-Yogi-Atmakatha.pdf/798

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

762

ఒక యోగి ఆత్మకథ

పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి కదా అని, నేను నా ప్రమాణాల్ని దిగజార్చలేను,” తమకు సహజమైన చిత్తశుద్ధితో గాంధీగారు ఇంకా ఇలా అన్నారు, “ఏ మాట కా మాటే చెప్పుకోవాలి - ఒక తాచుపామే కనక ఎదురయితే నేను నిబ్బరంగా ఇలా కబుర్లు చెప్పలేను!”

పథ్యం గురించి చాలా ఇటీవల వెలువడ్డ పాశ్చాత్య గ్రంథాలు కొన్ని ఆయన బల్ల మీద ఉన్నాయి; నేను వాటిని గురించి వ్యాఖ్యానించాను.

“ఔను. పథ్యం అన్నది, ప్రతిచోటా ఎంత ముఖ్యమో సత్యాగ్రహోద్యమంలో కూడా అంత ముఖ్యం,” అని ముసిముసిగా నవ్వుతూ అన్నారాయన. సత్యాగ్రహులకు సంపూర్ణమైన నిగ్రహం ఉండాలని చెప్పేవాణ్ణి కనక, బ్రహ్మచారికి (బ్రహ్మచర్యం పాటించేవాడికి) తగిన ఉత్తమ ఆహారం ఏమిటో కనుక్కోడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాను. ప్రజననకారక సహజాతాన్ని అదుపులో పెట్టుకోడానికి ముందు జిహ్వను జయించాలి. అర్ధాకలిగా ఉండడం కాని, అసంతులిత ఆహారం తీసుకోడం కాని దానికి ఉపాయం కాదు. తిండికోసం లోపల ఉండే అత్యాశను మొదట జయించి ఆ తరవాత, అవసరమైన విటమిన్లూ ఖనిజాలూ కేలరీలూ మొదలయినవన్నీ ఉండే సాత్త్విక ఆహారం తింటూ ఉండాలి సత్యాగ్రహి. ఆహారానికి సంబంధించిన బాహ్యాంతర జ్ఞానంవల్ల సత్యాగ్రహి శుక్లం, ఒంటికంతకీ పనికివచ్చే జీవశక్తిగా ఇట్టే మారుతుంది.

మాంసానికి బదులుగా తినదగ్గ మంచి ఆహారపదార్థాల గురించి మాకు తెలిసిన సంగతులు తులనాత్మకంగా ముచ్చటించుకున్నాం, గాంధీగారూ నేనూ. “అవొకేడో (avocado) అద్భుతమైంది.” అన్నాను నేను. “కాలిఫోర్నియాలో మా కేంద్రానికి దగ్గర, అవొకేడో తోపులు లెక్కలేనన్ని ఉన్నాయి.”