పుట:Oka-Yogi-Atmakatha.pdf/796

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

760

ఒక యోగి ఆత్మకథ

దుస్థితి నాకు కలుగుతుందేమోనన్న భయమేమీ లేదు. మరణ సమయంలో సైతం మనం ఆలుమగలుగానే ఉంటామన్న సంగతి నాకు తెలుసు.”

కస్తూరిబాయి చాలా సంవత్సరాలపాటు, ప్రజాద్రవ్యానికి కోశాధికారిణిగా పనిచేసేది. దైవస్వరూపులుగా ప్రజల మన్నన లందుకున్న మహాత్ములు, కొన్ని కోట్ల రూపాయిలు విరాళాలు సేకరించారు. గాంధీగారి సమావేశానికి వెళ్ళే ఆడవాళ్ళు నగలు పెట్టుకుని వెళ్తే, వాళ్ళ భర్తలకు బెరుకుగా ఉంటుందని భారతీయ గృహాల్లో నవ్వుకుంటూ కథలు కథలుగా చెప్పుకొనేవారు. దళితజాతి ఉద్ధరణకు శ్రమించే గాంధీమహాత్ముల సమ్మోహక స్వరం, సంపన్నుల బంగారం గాజుల్ని, వజ్రాలహారాల్నీ ఆకర్షించేసి, వాళ్ళ చేతులనుంచీ మేడలనుంచీ ఊడి చందాల బుట్టలో పడేట్టు చేస్తుంది.

ఒకనాడు, ప్రజానిధికి కోశాధికారిణి అయిన కస్తూరీబాయి, నాలుగు రూపాయిలు ఎలా ఖర్చయాయో లెక్క చెప్పలేకపోయింది. గాంధీగారు, ఆ నిధులకు సంబంధించిన లెక్కలు ఆడిట్ చేయించి ప్రచురిస్తూ, తమ భార్య నిర్వహణలో వచ్చిన నాలుగు రూపాయిల తేడానూ నిర్దాక్షిణ్యంగా ఎత్తి చూపించారు.

నేను ఈ కథ, నా అమెరికన్ విద్యార్థుల క్లాసుల్లో తరచుగా చెప్పేవాణ్ణి. ఒకనాడు సాయంత్రం హాలులో ఒకామె ఆగ్రహావేశంతో ఊగిపోయింది: “మహాత్ముడయేది, కాకపోయేది - ఆయనే కనక నా మొగుడయి ఉంటే - అనవసరంగా చేసిన అటువంటి బహిరంగమైన అవమానానికి, మొహం మీద ఒక్క గుద్దు గుద్దేదాన్ని!” అంటూ అరిచింది.

అమెరికన్ భార్యలగురించి, భారతీయ భార్యలగురించి మా మధ్య సరదాగా కొంత వాగ్వాదం జరిగిన తరవాత, నేను ఇంకా పూర్తిగా వివరించడానికి పూనుకున్నాను.