పుట:Oka-Yogi-Atmakatha.pdf/789

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీమహాత్ములతో వార్ధాలో

753

మేము ముగ్గురం బాబా సాహెబ్ దేశ్‌ముఖ్‌గారి అతిథులుగా సాయంత్రం 6 గంటలకు భోజనాలు చేశాం; రాత్రి ఏడు గంటలకు మళ్ళీ మేము మగన్‌వాడి ఆశ్రమంలో ప్రార్థన వేళకి వెళ్ళి డాబా ఎక్కాం; అక్కడ ముప్ఫైమంది సత్యాగ్రహులు గాంధీగారి చుట్టూ కూర్చుని ఉన్నారు. ఆయన ఒక తుంగచాపమీద కూర్చుని ఉన్నాడు. పాతకాలపు జేబు గడియారం ఒకటి ఆయనకు ముందరివేపు వేలాడుతోంది. వాలుతున్న సూర్యుడు తాటిచెట్లమీదా మర్రిచెట్లమీదా చివరి వెలుగులు ప్రసరిస్తున్నాడు; రాత్రి రొద, కీచురాళ్ళ చప్పుళ్ళు మొదలయాయి. వాతావరణం పూర్తిగా ప్రశాంతంగా ఉంది. నేను మైమరిచిపోయాను.

శ్రీ దేశాయి భజనకీర్తన ఒకటి పాడుతూ ఉండగా తక్కిన వాళ్ళంతా ఆయన పాడింది అందుకొని పాడుతున్నాడు; తరవాత గీతా పారాయణ జరిగింది. ముగింపు ప్రార్థన నన్ను చెయ్యమని మహాత్ములు నాకు సంజ్ఞ చేశారు. ఆలోచనకూ ఆశయానికి ఎటువంటి పొందిక ఉంది? ఎప్పటికీ మనస్సులో ఉండిపోయే స్మృతి: ఆకాశంలో అప్పుడే పొడిచిన చుక్కల కింద, వార్ధాలో మిద్దెమీద జరిగిన ధ్యానం.

కచ్చితంగా ఎనిమిది గంటల వేళకు గాంధీగారు మౌనం చాలించారు. ఆయన జీవితంలో కఠిన శ్రమ కలుగుతూ ఉండడంవల్ల, కాలాన్ని సూక్ష్మ ప్రమాణాల్లో కేటాయించడంకోసం అవసరమయింది.

“స్వాగతం స్వామీజీ!” ఈసారి మహాత్ము లిచ్చినది కాయితం మీద రాసి చూపించిన స్వాగతం కాదు. మేము అప్పుడే డాబామీంచి దిగి ఆయన రాతగదికి వెళ్ళాం. అందులో చదరలు (కుర్చీలు లేవు), పుస్తకాలు, కాయితాలు, మామూలు కలాలు (ఫౌంటెన్ పెన్నులు కావు) ఉన్న పొట్టి డస్కు పెట్టె, ఒక మూల టిక్కు టిక్కుమనే పాత గడియారం ఉన్నాయి. సర్వత్ర వ్యాప్తమయిన కాంతి, భక్తి ప్రభతో గాంధీగారు,