పుట:Oka-Yogi-Atmakatha.pdf/788

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

752

ఒక యోగి ఆత్మకథ

“ఈ దేశంలో, ‘నేను నా ఇంటికే తిరిగి వచ్చాను’ అనిపిస్తుంది. ఇప్పుడిక నా పాత జీవనసరళికీ పాత అభిరుచులకూ మారిపోవాలని అనిపించదు.”

మేము కొంచెంసేపు అమెరికాగురించి మాట్లాడుకున్నాం. “భారతదేశాన్ని సందర్శించే అమెరికన్లు అనేకమంది, ఆధ్యాత్మిక విషయాల్లో కనబరిచే గాఢమైన ఆసక్తి గమనించి నే నెప్పుడూ సంతోషిస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాను,”[1] అన్నదామె.

మరి కాస్సేపట్లోనే మీరా బెహెన్‌కు రాట్నంతో చేతుల నిండా పని పడింది. గాంధీ మహాత్ముల కృషివల్ల రాట్నాలిప్పుడు భారతీయ గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి.

కుటీర పరిశ్రమల పునరుద్ధరణను ప్రోత్సహించడానికి గాంధీగారికి బలమైన ఆర్థిక, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి, కాని ఆయన ఆధునిక ప్రగతినంతనూ పిచ్చిగా ఖండించమని చెప్పరు. యంత్రాలు, రైళ్ళు, కార్లు, టెలిగ్రాఫు ఆయన జీవితంలోనే ప్రముఖ పాత్రలు వహించాయి! జైలులోనూ బయటా కూడా కలిపి ఏభై ఏళ్ళపాటు ఆయన ప్రజాసేవ చేసిన కాలంలో, రాజకీయ ప్రపంచంలోని వ్యవహార వివరాలతోనూ కఠోర సత్యాలతోనూ ప్రతిరోజూ కుస్తీపట్లు పడుతూండేవారు. అయితే ఇవి, ఆయన మనస్సంతులనాన్నీ నిష్కాపట్యాన్నీ మతిస్థిమితాన్నీ మానవ స్వభావంలోని చిత్రవిచిత్రాల్నీ హాస్యధోరణిలో మెచ్చుకోడం మాత్రమే పెరిగేటట్టు చేశాయి.

  1. మిస్ స్లేడ్‌ను చూస్తుంటే నాకు గుర్తువచ్చిన మరో వ్యక్తి మిస్ మార్గరెట్ వుడ్రో విల్సన్; ఈమె అమెరికా అధ్యక్ష మహాశయుల పుత్రిక. ఈమెను నేను అమెరికాలో కలుసుకున్నాను. భారతదేశం మీద ఈమెకు గాఢమైన ఆసక్తి ఉండేది. తరవాత ఈమె పుదుచ్చేరి వెళ్ళింది; జీవితంలో చివరి ఐదేళ్ళూ ఈవిడ అక్కడే ఆత్మద్రష్ట అయిన మహాయోగి, శ్రీ అరవింద ఘోష్ పాదసన్నిధిలో - సంతోషంగా శిక్షణ పొందుతూ గడిపింది.