పుట:Oka-Yogi-Atmakatha.pdf/790

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

754

ఒక యోగి ఆత్మకథ

సమ్మోహకమూ గహ్వర సదృశమూ అయిన బోసినోటితో చిరునవ్వు చిందిస్తున్నారు.

“చాలా ఏళ్ళ కిందట, నా ఉత్తరప్రత్యుత్తరాల పని చూసుకోడానికి వ్యవధికోసం, వారానికి ఒకరోజు మౌనం పాటించడం ప్రారంభించాను. కాని ఇప్పుడు, ఆ ఇరవై నాలుగు గంటలూ ప్రధాన ఆధ్యాత్మిక అవసరంగా పరిణమించాయి. నియత కాలికమైన మౌనం ఒక భాగ్యమే కాని చిత్రహింస కాదు,” అని వివరించారాయన.

నేను మనసారా అంగీకరించాను.[1] మహాత్ములు నన్ను అమెరికాగురించి, యూరప్‌గురించి అడిగారు; భారతదేశాన్ని గురించి, ప్రపంచ పరిస్థితులగురించి మేము చర్చించుకున్నాం.

“మహాదేవ్,” శ్రీ దేశాయి గదిలో అడుగుపెడుతూ ఉండగా గాంధీగారు అన్నారు, “స్వామిజీ రేపు రాత్రి యోగాన్నిగురించి మాట్లాడ్డానికి టౌన్ హాల్లో ఏర్పాట్లు చేయించండి.”

ఆ రాత్రికి నేను మహాత్ముల దగ్గర సెలవు తీసుకుంటూ ఉండగా ఆయన, ముందు చూపుతో, సెట్రోనెల్లా ఆయిల్ (ఒక రకం గడ్డి నూనె) సీసా ఒకటి నా చేతికి ఇచ్చారు.

“వార్ధా దోమలకి అహింస[2] సంగతేదీ తెలియదు. స్వామీజీ?” అన్నారాయన, నవ్వుతూ.

  1. నేను అమెరికాలో చాలా సంవత్సరాలనుంచి మౌనసమయాలు పాటిస్తూ నన్ను కలుసుకోడానికి వచ్చేవాళ్ళకూ నా కార్యదర్శులకూ వెరపు కలిగిస్తూ వచ్చాను.
  2. హాని చెయ్యకపోవడం; గాంధీజీ జీవిత తత్త్వాని కిది పునాది. అహింసను మూలగుణంగా మన్నించే జైనులవల్ల ఆయన గాఢంగా ప్రభావితులయారు. హిందూమతంలో ఒక శాఖ అయిన జైనమతాన్ని బుద్ధుడి సమకాలికుడైన మహావీరుడు, క్రీ. పూ. 6 శతాబ్దిలో విస్తృతంగా వ్యాప్తిచేశాడు. మహావీరుడంటే “గొప్ప నాయకుడు” - అనేక శతాబ్దాల అనంతరం ఆయన, తన వీరపుత్రులైన గాంధీగారిని చూసుగాక!