పుట:Oka-Yogi-Atmakatha.pdf/782

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

746

ఒక యోగి ఆత్మకథ

పూరీ ఆశ్రమానికి దగ్గరలోనే ఉండేది. గురుదేవులు పొద్దుటి పూట షికారుకు వెళ్ళేటప్పుడు తరచుగా ఆవిడ ఇంటి దగ్గర కాస్సేపు ఆగి, కబుర్లు చెప్పి వెళ్తూ ఉండేవారు. 1936 మార్చి 16 తేదీ సాయంత్రం మా, ఆశ్రమానికి వచ్చి, గురువుగారిని ఓసారి కలుసుకోడానికి వచ్చాను అన్నది.

“అదేమిటి, గురుదేవులు వారంరోజుల కిందటే పోయారు కదమ్మా!” అన్నాడు, పూరీ ఆశ్రమం నిర్వహణ బాధ్యత తీసుకున్న స్వామి సేవానంద, ఆవిడవేపు విచారంగా చూస్తూ.

“అసంభవం!” అంటూ చిరునవ్వు నవ్వుతూ ఆక్షేపణ తెలిపిందావిడ.

“కాదమ్మా!” అంటూ గురుదేవుల్ని సమాధి చెయ్యడానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పాడు సేవానంద. “రండి, ఆయన సమాధికి ఎదురుగా ఉన్న తోటకు తీసుకువెడతా మిమ్మల్ని.”

మా తల తిప్పింది. “ఆయనకి సమాధేమిటి! ఈవేళ పొద్దున పదింటికి ఆయన, మామూలుగా షికారుకు వెళ్తూ మా ఇంటి మీదుగా వెళ్ళారు! పట్టపగలు, ఆరుబయట, నేను ఆయనతో చాలా నిమిషాలసేపుమాట్లాడాను.

“ ‘ఈవేళ సాయంత్రం ఆశ్రమానికి రా’ అన్నారాయన.”

“వచ్చాను! పండబారిన ఈ ముసలి తలమీద ఆయన దీవెనలు కురిశాయి! ఈవేళ పొద్దున ఆయన మా ఇంటికి వచ్చింది. ఎలాటి దివ్య దేహంతోనో నేను తెలుసుకోవాలని అనుకున్నారు, అమర గురుదేవులు!”

సేవానంద ఆశ్చర్యపోయి ఆవిడముందు మోకరిల్లాడు.

“మా, నా గుండెలోంచి ఎంత దుఃఖభారం తీసేవు తల్లి! ఆయన పునరుత్థానం చెందారు!” అన్నాడతను.