పుట:Oka-Yogi-Atmakatha.pdf/781

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీయుక్తేశ్వర్‌గారి పునరుత్థానం

745

సూక్ష్మతర స్వప్నజనిత గ్రహానికి రాగలడు; అక్కడ నేను అచ్చం, భూమిమీదున్నప్పటి శరీరంలాటి శరీరంతోనే పునరుత్థానం చెంది ఉండడం గమనిస్తాడు. యోగానందా, ఈ మాట అందరికీ చెప్పు!”

వియోగదుఃఖమంతా మబ్బులా విడిపోయింది. కొంత కాలంగా, ఆయన మరణంవల్ల కలిగిన సంతాపం, శోకం నా మనశ్శాంతిని హరిస్తూ వచ్చాయి; కాని ఇప్పుడవి చిన్నబుచ్చుకుని పరారి అయ్యాయి. కొత్తగా ఏర్పడ్డ అంతులేని ఆత్మఛిద్రాలగుండా, దివ్యానందం ఒక నీటిబుగ్గలా ఎగజిమ్మింది. ఉపయోగంలో లేకపోవడంవల్ల ఏనాడో పూడుకుపోయిన ఈ చిల్లులు, ఒక్కసారి ఆనందపు వెల్లువ పోటెత్తేసరికి, పెద్దవయాయి. నా పూర్వజన్మలు, చలనచిత్రం మాదిరి క్రమమైన వరసలో నా లోపలి కంటికి అవుపించాయి. వెనకటి సత్కర్మ దుష్కర్మలు రెండూ, గురుదేవుల దివ్యసందర్శనవల్ల నా చుట్టూ ప్రసరించిన విశ్వకాంతిలో కరిగిపోయాయి.

నా ఆత్మకథలోని ఈ ఆధ్యాయంలో, మా గురుదేవుల ఆదేశాన్ని అనుసరించి శుభవార్త చాటాను; అయితే అది, జిజ్ఞాసారహితుల్ని మరోసారి చిరాకుపెడుతుంది. నేలమీద పొర్లాడడం బాగా ఎరుగును మనిషి; నిస్పృహ కలక్కపోవడం అతనికి అరుదు; అయినా ఇవి వికృతులు. మానవుడి సత్యస్వరూపంలో భాగాలు కావు, అతడు సంకల్పించిన రోజున స్వాతంత్ర్య పథంలో అడుగుపెడతాడు. చాలా కాలంగా అతడు, అజేయమైన ఆత్మను లెక్కచెయ్యకుండా - “మట్టివి నువ్వు” అంటూ చెప్పే ఘోరమైన నిరాశావాదాన్ని చెవిని పెడుతూ వచ్చాడు.

పునరుత్థానం చెందిన మా గురుదేవుల్ని దర్శించే భాగ్యం కలిగిన వాణ్ణి నే నొక్కణ్ణే కాను.

శ్రీయుక్తేశ్వర్‌గారి శిష్యకోటిలో ఒక ముసలావిడ ఉండేది; ఆవిణ్ణి అందరూ ‘మా’ (అమ్మ) అని పిలిచేవారు, ఆప్యాయంగా. ఆవిడ ఇల్లు