పుట:Oka-Yogi-Atmakatha.pdf/750

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

714

ఒక యోగి ఆత్మకథ

సింహులేనా? పూరీ ఇసక పర్రలో పూడ్చిపెట్టిన శరీరం మాదిరి మరోదేహం ధరించి వచ్చారా మీరు?”

“నేను వాణ్ణే నాయనా. ఇది రక్తమాంసాలున్న శరీరం. నేను దీన్ని సూక్ష్మశరీరంగా చూస్తున్నప్పటికీ, నీ దృష్టి కిది భౌతికమైనదే. విశ్వాణువుల్లోంచి నేను పూర్తిగా కొత్త శరీరాన్ని సృష్టించుకున్నాను. ఇది ముమ్మూర్తులా, నీ స్వప్నలోకంలో, పూరీలో స్వప్నభూమిలో నువ్వు పూడ్చిపెట్టిన, విశ్వస్వప్న భౌతికశరీరాన్ని పోలి ఉన్నదే. నిజం చెప్పాలంటే, నేను పునరుత్థానం చెందాను - భూమిమీద కాదుకాని, ఒక సూక్ష్మలోకంలో. అక్కడుండేవాళ్ళు, భూమిమీది మానవులకన్న ఎక్కువగా, నా ఉన్నత ప్రమాణాలకు నిలబడగలవాళ్ళు. ఎప్పటికో ఒకనాటికి, నువ్వూ నీ ప్రియతములూ అక్కడికి వచ్చి నాతోబాటు ఉంటారు.”

“మృత్యుంజయులై న గురుదేవా, ఇంకా చెప్పండి.”

గురుదేవులు చటుక్కున, ముచ్చటగా ముసిముసి నవ్వు నవ్వారు. “నాయనా, నీ పట్టు రవ్వంత సడలించవూ?” అంటూ అడిగారు.

“రవ్వంతే!” అప్పటిదాకా నే నాయన్ని, ఉడుంపట్టులా గట్టిగా పట్టేసుకుని ఉన్నాను. పూర్వం ఆయన శరీరానికి విలక్షణంగా ఉంటూండే కొద్దిపాటి సహజ సుగంధమే ఇప్పుడు కూడా ఆయనకు ఉందని పసిగట్టాను. ఆయన దివ్యశరీర స్పర్శవల్ల కలిగిన ఒకానొక ఆనందానుభూతి ఆనాడు ఆయనతో గడిపిన గంటలు తలుచుకున్నప్పుడల్లా, నా చేతుల్లోనూ అరిచేతుల్లోనూ జివ్వుమంటూ ఉంటుంది.

“భౌతిక కర్మను అనుభవిస్తూండే మానవులకు సహాయం చెయ్యడానికి భగవంతుడు, భూమిమీదికి ప్రవక్తలను పంపినట్లే, ఒక సూక్ష్మలోకంలో రక్షకుడిగా సేవ చెయ్యమని భగవంతుడు నన్ను ఆదేశించాడు,”