పుట:Oka-Yogi-Atmakatha.pdf/751

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీయుక్తేశ్వర్‌గారి పునరుత్థానం

715

అంటూ వివరించారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “దాన్ని ‘హిరణ్యలోకం’ అంటారు. ఆ లోకంలో ప్రగతి పొందిన సాధకులు తమ సూక్ష్మలోక కర్మనుంచి విముక్తి పొందడానికి సూక్ష్మలోక పునర్జన్మలు లేకుండా చేసుకోడానికి అక్కడ నేను సాయపడుతున్నాను. హిరణ్యలోకవాసులు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అభివృద్ధి సాధించినవాళ్ళు, వాళ్ళంతా భూమిమీద తమ పూర్వజన్మలో, మరణసమయంలో ఒంటిమీద స్పృహతో భౌతికకాయాన్ని విడిచి వెళ్ళిపోవడానికి వీలు కలిగించే, ధ్యానోపార్జితమైన శక్తిని సాధించినవాళ్ళు. వెనకటి మానవ జీవితంలో సవికల్ప నిర్వికల్ప సమాధి స్థితుల అనుభవం గడిస్తేనే కాని, ఎవ్వరూ హిరణ్యలోకంలోకి ప్రవేశించలేరు.[1]

“హిరణ్యలోకవాసులు అంతకు పూర్వమే, సాధారణ సూక్ష్మమండలాలగుండా సాగివచ్చి అక్కడికి చేరి ఉంటారు; భూలోక ప్రాణులు దాదాపు అందరూ, మరణించిన తరవాత ఆ సూక్ష్మ మండలాలకు చేరవలసిందే. అక్కడ, సూక్ష్మలోకాల్లోని తమ పూర్వకర్మలకు సంబంధించిన అనేక బీజాల్నీ నశింపుచేసుకుని ఉంటారు. ఉచ్చస్థితిలో ఉన్న

  1. సవికల్ప సమాధిలో భక్తుడు, బ్రహ్మమూ తానూ ఒకరేనన్న అనుభూతి పొందుతాడు. కాని, నిశ్చల సమాధి స్థితిలో తప్ప విశ్వచైతన్యాన్ని నిలుపుకోలేడు. అఖండమైన ధ్యానం ద్వారా అతను, నిర్వికల్ప సమాధి అనే ఉన్నతస్థితిని చేరుకుంటాడు; అప్పుడతను దైవానుభూతిని కోల్పోకుండానే ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతూంటాడు.

    నిర్వికల్ప సమాధిలో యోగి, తన భౌతిక కర్మలోని, అంటే, భూలోక సంబంధమైన కర్మలోని - చివరి లేశాల్ని క్షయం చేసుకుంటాడు. అయినప్పటికీ అతనికి కొంత సూక్ష్మ, కారణ కర్మలు అనుభవించవలసి ఉంటుంది; అంచేత, ఉన్నత స్పంద మండలాల్లోని సూక్ష్మలోకంలోనూ కారణలోకంలోనూ దేహధారణ చెయ్యవలసి ఉంటుంది.