పుట:Oka-Yogi-Atmakatha.pdf/749

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీయుక్తేశ్వర్‌గారి పునరుత్థానం

713

మంచం మీద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండగా, ఒకానొక దివ్య కాంతి నాకు బాహ్యస్మృతి కలిగించింది. నేను కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా, నా గది ఒక విచిత్ర ప్రపంచంగా మారిపోయింది; సూర్యకాంతి ఒక దివ్యతేజస్సుగా పరిణామం చెందింది.

ఎదురుగా, రక్తమాంసాలతో నిండిన శ్రీయుక్తేశ్వర్‌ గారి విగ్రహాన్ని చూసేసరికి ఆనంద తరంగాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేశాయి.

“నాయనా!” అంటూ వాత్సల్యం ఉట్టిపడేటట్టు పిలిచారు, గురుదేవులు. ఆయన ముఖంలో దివ్యదరహాసం వెలుగుతోంది!

జీవితంలో మొట్టమొదటి సారిగా నేను ఆయన పాదాలముందు మోకరిల్ల నిది అప్పుడే; ఆబగా ఆయన్ని చుట్టేసుకోవాలని చటుక్కున ముందుకు ఉరికాను. ఎంత మహత్తరమైన మధుర క్షణం! అప్పటికి కొన్ని నెలలుగా నాలో గూడు కట్టుకుని ఉన్న విషాదం, ఇప్పుడు ఒక్కసారి వెల్లువలా వచ్చిపడుతున్న దివ్యానందంవల్ల ఇట్టే తేలిపోయినట్టు అనిపించింది.

“నా గురుదేవా, నన్ను విడిచి పెట్టి ఎందుకు వెళ్ళిపోయారు?” ఆనందం పట్టలేక, నా మాటలు తడబడుతూ వెలువడ్డాయి. “నన్నసలు కుంభమేళాకి ఎందుకు వెళ్ళనిచ్చారు? మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినందుకు నన్ను నేను ఎంత కసిగా తిట్టుకున్నానో తెలుసా?”

“నేను మొట్టమొదటిసారి బాబాజీ దర్శనం చేసుకున్న యాత్రా స్థలాన్ని చూడాలని నువ్వెంతో ఉవ్విళ్ళూరుతున్నావు; అంచేత నీ ఆశకు అడ్డు రాగూడదనుకున్నాను. అయినా నేను, నిన్ను విడిచి ఉన్నది కాస్సేపే; ఇదుగో, మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర లేనూ?”

“అయితే గురుదేవా, ఇప్పుడిక్కడ ఉన్న వారు మీరేనా? ఆ గురు