పుట:Oka-Yogi-Atmakatha.pdf/743

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల సన్నిధిలో చివరి రోజులు

707

తరవాత మా బండి గర్జనచేస్తూ పూరీవేపు సాగుతూ ఉండగా, నా ఎదుట శ్రీయుక్తేశ్వర్‌గారి రూపం దర్శన మిచ్చింది. గంభీర భంగిమలో కూర్చుని ఉన్నారాయన. రెండు పక్కలా రెండు దీపాలు ఉన్నాయి.

“అయిపోయిందా అంతా?” అంటూ ప్రాధేయపూర్వకంగా చేతులు ఎత్తాను.

ఆయన తల ఊపారు. తరవాత మెల్లగా అదృశ్యమయారు.

మర్నాడు పొద్దున నేను పూరీ ప్లాట్‌ఫారం మీద నించుని - అప్పటికీ, అనుకున్నది జరగదని అనుకుంటూనే రవ్వంత ఆశ పట్టుకొని వేలాడుతూ ఉండగా, నాకు తెలియని వ్యక్తి ఎవరో నా దగ్గరికి వచ్చాడు.

“మీ గురువుగారు పోయిన సంగతి విన్నారా?” మరో మాట ఏమీ అనకుండా వెళ్ళిపోయాడాయన; ఆయన ఎవరో, నన్ను ఎక్కడ కలుసుకోవలసిందీ ఆయనకి ఎలా తెలిసిందో కనిపెట్టడానికి నేను ప్రయత్నించలేదు.

మా గురుదేవులు ఆ దుర్వార్తను రకరకాలుగా నాకు అందించడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి గ్రహించి కొయ్యబారిపోయి, నేను ఫ్లాట్‌ఫారం గోడమీద వాలిపోయాను. తిరుగుబాటుతో కుతకుతలాడుతున్న నా అంతరంగం ఒక అగ్నిపర్వతంలా ఉంది. నేను పూరీ ఆశ్రమానికి చేరేసరికి, దాదాపు స్పృహతప్పి పడిపోయే స్థితిలో ఉన్నాను. “గుండె చిక్కబట్టుకో, ప్రశాంతంగా ఉండు,” అంటూ పదేపదే మృదువుగా చెబుతూ వస్తోంది అంతర్వాణి.

ఆశ్రమంలో గురుదేవుల భౌతికకాయం ఉన్న గదిలో అడుగు పెట్టాను. ఊహించలేనంత సజీవంగా, పద్మాసనంలో ఉంది ఆయన శరీరం; ఆరోగ్యం, సౌందర్యం ఉట్టిపడుతున్నాయి. చనిపోవడానికి, కొన్నాళ్ళ