పుట:Oka-Yogi-Atmakatha.pdf/742

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

706

ఒక యోగి ఆత్మకథ

అన్నం తినడానికి కూర్చునేటప్పటికి, ప్రతి ఒక్క బ్రాహ్మడికీ పక్కన ఒక్కొక్క రవిదాసు కనిపించాడు. ఈ సామూహిక దర్శనానుభవంవల్ల చిత్తోడ్‌లో, విస్తృతంగా ఆధ్యాత్మిక పునరుద్ధరణ జరిగింది.

మరి కొన్నాళ్ళకు మేము కలకత్తా చేరుకున్నాం. శ్రీయుక్తేశ్వర్‌గారిని చూడాలని తహతహలాడుతూ ఉండగా, ఆయన శ్రీరాంపూర్ నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు, దక్షిణదిశలో మూడువందల మైళ్ళ దూరంలో ఉన్న పూరీలో ఉన్నారని విని నిరాశపడ్డాను.

“వెంటనే పూరీ రండి.” ఈ టెలిగ్రాం మార్చి 8 న అతుల్‌చంద్రరాయ్ చౌదరి ఇచ్చినది; ఈ సోదర శిష్యుడు గురుదేవుల కలకత్తా శిష్యుల్లో ఒకరు. ఆ వార్త చెవిని పడగానే, దాంట్లో ఉన్న అంతరార్థానికి నేను వ్యసనపడి కింద మోకరిల్లి, మా గురుదేవుల ప్రాణం కాపాడమని దేవుడికి మొరపెట్టుకున్నాను. నాన్న గారి ఇంటి దగ్గర్నించి రైలుకు బయలుదేరబోతూ ఉండగా లోపలినించి ఒక దివ్యవాణి పలికింది.

“ఈ రాత్రి పూరీ వెళ్ళకు. నీ ప్రార్థన మన్నించడానికి వీలులేదు.”

“ప్రభూ, గురుదేవుల ప్రాణం కాపాడమని పదేపదే నేను చేసే ప్రార్థనల్ని నువ్వు తిరస్కరించవలసి ఉంటుంది కనక, పూరీలో నాతో పెనుగులాటకు దిగడం నీకు ఇష్టం లేదు. అలాగయితే ఆయన, నీ సంకల్పం మేరకే ఉత్తమ విధులు నిర్వహించడానికి వెళ్ళిపోవాలా?”

ఆంతరికమైన ఆదేశానికి తల ఒగ్గి, ఆ రోజు రాత్రి పూరీ ప్రయాణం మానుకున్నాను. మర్నాడు సాయంత్రం బండికి బయలుదేరాను; దారిలో ఏడుగంటల వేళ, నల్లటి సూక్ష్మమేఘం ఒకటి ఆకాశాన్ని కమ్మింది.[1]

  1. శ్రీయుక్తేశ్వర్‌గారు 1936 మార్చి 9 న, సరిగా అదే సమయంలో, రాత్రి 7 : 00 గంటలకు మహాసమాధి చెందారు.