పుట:Oka-Yogi-Atmakatha.pdf/717

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దక్షిణ భారత విహారయాత్ర

681

సమాధిలో ఉన్న సదాశివబ్రహ్మంగారు హఠాత్తుగా ముంచుకు వచ్చిన వరదలో కొట్టుకు పోవడం కనిపించింది. ఆ తరవాత కొన్ని వారాలకు, కోయంబత్తూరు జిల్లాలో కోడుమూడి దగ్గిర ఒక మట్టిదిబ్బకు అడుగున లోతుగా కూరుకుపోయి కనిపించారు. ఊరివాళ్ళు పారలతో మట్టి తవ్వుతూ ఉండగా, ఆ పారలు ఒంటికి తగిలి, ఆ సాధువు లేచి చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయారు.

సదాశివబ్రహ్మంగారు ఒకసారి, ఒక వృద్ధ వేదాంత పండితుడితో జరిగిన శాస్త్రచర్చలో వ్యర్థాలాపం చేసినందుకు గురువుగారిచేత చీవాట్లు తిన్నారు; ఆ తరవాత ముని (మాట్లాడని సాధువు) అయారు. “అబ్బాయ్, నువ్వు నోటిని అదుపులో పెట్టుకోడం ఎప్పుడు నేర్చుకుంటావ్ ?” అన్నారు గురువుగారు.

“మీ దీవెనలుంటే, ఇప్పుడు ఈ క్షణంలోనే నండి.”

సదాశివుల గురువులు స్వామి శ్రీ పరమ శివేంద్ర సరస్వతి. ఈయన ‘దహరవిద్యాప్రకాశిక’ అన్న గ్రంథానికి కర్తలు. ఉత్తర గీతమీద ఉత్కృష్టమైన వ్యాఖ్యానం కూడా రాశారు. ప్రాపంచిక మానవులు కొందరు, సదాశివబ్రహ్మంగారు దైవోన్మత్తత చెంది తరచుగా “సభ్యత విడిచి” రోడ్లమీద ఆడిపోతూండడం అవమానంగా భావించి గురువుగారికి ఫిర్యాదు చేశారు. “స్వామీ, సదాశివుడు పిచ్చివాటికంటె మెరుగేమీ కాడండి,” అన్నారు వాళ్ళు.

కాని పరమ శివేంద్రులు ఆనందభరితులై చిరునవ్వు చిందించారు. “అయ్యో, తక్కినవాళ్ళకి కూడా ఈ పిచ్చి ఉంటే ఎంత బాగుండేది!” అన్నారు.

సదాశివుల జీవితం, భగవంతుడి అదృశ్య హస్తంతో జరిగిన అనేక