పుట:Oka-Yogi-Atmakatha.pdf/718

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

682

ఒక యోగి ఆత్మకథ

అద్భుత, సుందరలీలలతో విలక్షణత నందుకొన్నది. ఈ లోకంలో అన్యాయంగా కనిపించేది చాలా ఉంది; కాని దైవభక్తులు, ఆయన చేసే తక్షణ న్యాయానికి అసంఖ్యాకమైన సందర్భాల్ని ధ్రువపరచగలరు. ఒకనాడు రాత్రి సదాశివులు ఎక్కడికో వెళ్తూ సమాధి స్థితిలో ఉండగా, ఒక సంపన్న గృహస్థు వడ్ల గాదె దగ్గర ఆగారు. అక్కడ కాపలాకాస్తున్న ముగ్గురు నౌకర్లు ఆ సాధువును చూసి దొంగ అనుకొని కొడదామని కర్రలు ఎత్తారు. అంతే! వాళ్ళ చేతులు అలాగే కదలకుండా ఉండిపోయాయి. పైకెత్తి ఉన్న చేతులతో, చిత్రమైన విగ్రహాల్లా నిలబడిఉన్న ఆ ముగ్గురూ, వేకువ వేళ సదాశివబ్రహ్మంగారు అక్కణ్ణించి వెళ్ళిపోయేవరకు అలాగే ఉండిపోయారు.

మరో సందర్భంలో, కూలీలచేత మట్టి మోయిస్తున్న ఒక మేస్త్రి, దారినిపోయే ఈ మహాయోగిని బలవంతంచేసి పని చేయించుకున్నాడు; ఆ మేస్త్రి తాలూకు కూలీలు వంటచెరుకు మోసుకువెళ్తున్నారు. ఆ మౌన సాధువు సవినయంగా ఆ బరువు మోసుకువెళ్ళి అడంగుకు చేర్చి, ఒక పెద్ద కట్టెల పేర్పుమీద పెట్టారు. వెంటనే ఆ గుట్ట అంతా భగభగా మండిపోయింది.

సదాశివబ్రహ్మేంద్రులు కూడా త్రైలింగస్వామివారిలాగే, బట్టకట్టుకునేవారు కారు. ఒకనాడు పొద్దున ఈ దిగంబరయోగి, పరాకుగా ఒక ముస్లిం సర్దారు గుడారంలోకి ప్రవేశించారు. ఇద్దరు ఆడవాళ్ళు బెంబేలుపడి కెవ్వున అరిచారు; సర్దారు కత్తి దూసి క్రూరంగా సదాశివుల చెయ్యి నరికేశాడు; చెయ్యి తెగిపడిపోయింది. సదాశివులు అదేమీ పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయారు. ఆశ్చర్యమూ పరితాపమూ పెనవేసుకుపోగా ఆ ముస్లిం, నేలమీద పడిఉన్న చేతిని తీసుకుని సదాశివుల వెనకాలే వెళ్ళాడు. ప్రశాంతంగా ఆ యోగి, నెత్తురు ఓడుతున్న మొండి భుజంలోకి