పుట:Oka-Yogi-Atmakatha.pdf/698

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

662

ఒక యోగి ఆత్మకథ

గత పక్షంరోజుల్లో నేను, మైసూరు నగరంలోని పురమందిరంలోనూ మహారాజావారి కళాశాలలోనూ, విశ్వవిద్యాలయ వైద్యవిద్యాలయంలోనూ వేలాది పురజనుల్నీ విద్యార్థుల్ని ఉద్దేశించి ఉపన్యాసాలు చేశాను. అలాగే బెంగుళూరు నేషనల్ హైస్కూలులోనూ, ఇంటర్మీడియట్ కాలేజీలోనూ, మూడు వేల మంది సమావేశమయిన చెట్టి టౌన్ హాల్లోనూ మహాజనసభల్లో ప్రసంగించాను. అమెరికాను గురించి నేను చిత్రించిన రూపం శ్రోతల్ని ముగ్ధుల్ని చేసిందో ఏమోకానీ, ప్రాచ్య పాశ్చాత్య ప్రపంచాల ఉత్తమ లక్షణాల్ని వినిమయం చేసుకోడంవల్ల కలిగే పరస్పర లాభాల్ని గురించి నేను చెప్పినప్పుడల్లా హర్షధ్వనులు మాత్రం బ్రహ్మాండంగా వినవచ్చాయి.

శ్రీ రైట్, నేనూ ఇప్పుడు ఉష్ణమండల ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకుంటున్నాం. మైసూరుగురించి తనకు కలిగిన భావాల్ని అతను ప్రయాణం డైరీలో ఇలా రాసుకున్నాడు:

“ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ, ఆకాశంలో అడ్డంగా విస్తరించుకొని ఉండి, దేవుడి చిత్రరచనకు ఆధారమైన కేన్వాసు వేపు మైమరిచి చూస్తూ ఆనందోన్మత్తులమై అనేక క్షణాలు అలాగే ఉండిపోయాం. దానికి కారణం, ఆయన స్పర్శ ఒక్కటే జీవిత నవ్యతతో స్పందించే వన్నెల్ని సృష్టించగలగడం. మానవుడు కేవలం రంజక పదార్థాలతో ఆయన్ని అనుకరించడానికి ప్రయత్నించినప్పుడు, ఆ వన్నెల పరువం నశించిపోతుంది. ఎందుచేతంటే ఈశ్వరుడు, తైలవర్ణాల్ని కాని రంజకపదార్థాల్నికాని ఉపయోగించకుండా, వాటికన్న సులభంగానూ ప్రభావోత్పాదకంగానూ ఉండే, కేవలం కాంతికిరణాలనే సాధనాన్ని వాడడానికి పూనుకుంటాడు. ఇక్కడ ఒక్కసారి వెలుతురు చిమ్ముతాడు; అది ఎరుపును ప్రతిఫలిస్తుంది. మళ్ళీ కుంచె విదిలిస్తాడు; క్రమంగా