పుట:Oka-Yogi-Atmakatha.pdf/699

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దక్షిణ భారత విహారయాత్ర

663

నారింజ, బంగారువన్నెల కలగలుపులోకి దిగుతుంది. ఆ తరవాత ఆయన, నీటివంకాయవన్నె బరిసెతో మబ్బుల్ని తూట్లు పొడుస్తాడు; గాయం నుంచి ఓడే నెత్తురులా ఎర్రటి వలయం ఒకటి ఏర్పడుతుంది. ఈ విధంగా ఆయన, రాత్రి పొద్దునా ఒకే విధంగా క్రీడిస్తూ ఉంటాడు. ఎప్పటికీ మారిపోతూ ఎప్పటికీ కొత్తగా, ఎప్పటికీ తాజాగానే ఉంటాయవి; వాటికి నకళ్ళు లేవు, నమూనాలు లేవు, అచ్చంగా అవే వన్నెలు ఉండడం అంతకన్న లేదు. పగటినించి రాత్రికీ రాత్రినించి పగటికీ భారతదేశంలో జరిగే మార్పులోని అందానికి సాటి మరెక్కడా లేదు. ఒక్కొక్కప్పుడు ఆకాశంలో, భగవంతుడు తన రంగులపెట్టెలోని రంగులన్నిటినీ తీసుకొని ఆకాశంలోకి ఒక్కసారి విరజిమ్మి బ్రహ్మాండమైన బహువర్ణ దర్శినిని భాసింపజేస్తాడు.”

“ఒకనాడు మధ్యాహ్న సమయం దాటిన తరవాత యోగానందగారూ నేనూ, మైసూరు నగరానికి పన్నెండుమైళ్ళ దూరంలో ఉన్న కృష్ణరాజసాగర్ డామ్[1] చూడ్డానికి వెళ్ళాం. మేమొక చిన్న బస్సు ఎక్కాం. బ్యాటరీకి బదులుగా, క్రాంకు తిప్పడానికి ఒక చిన్న కుర్రవాడు ఉన్నాడందులో. అస్తమిస్తున్న సూర్యుడు క్షితిజంలో, నలిగి మిగలముగ్గిన టమాటా పండులా అవుపిస్తున్నాడు. నున్నటి మట్టిరోడ్డు మీద బయలు చేరింది మా బస్సు”

“పొడుగాటి కొబ్బరిచెట్ల మధ్యగా, హాయి కలిగించే మర్రితోపుల గుండా, ఎటు చూసినా ఎదురయే వరిమళ్ళను దాటిపోతూ ముందుకు సాగిపోయింది మా దారి; దాదాపు ప్రతిచోటా, అడవిలో అల్లుకుపోయినంత

  1. ఈ ఆనకట్ట ఒక పెద్ద జలవిద్యుదుత్పాదన కేంద్రం. ఇది మైసూరు నగరానికి వెలుతురు ప్రసాదిస్తుంది; పట్టుబట్టలూ సబ్బులూ చందనం చమురూ ఉత్పత్తిచేసే కర్మాగారాలకు విద్యుత్తును ఇస్తుంది.